ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శాసనాల సాయిరాం దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం 3 టౌన్ పోలీసులు సాయిరాంపై కేసు నమోదు చేసి, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు సాయిరాంతో సంతకం చేయించుకుని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేస్తున్న సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ వారికి పోలీసులు సహకరిస్తున్నారు. కానీ బీజేవైఎం కార్యకర్తలపై మాత్రం కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు” అని ఆరోపించారు. తనపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి అరెస్టులు, కేసులకు తాను భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని సాయిరాం స్పష్టం చేశారు.


