పట్టపగలే దర్జాగా గుట్టలను కొల్లగొట్టి చదును చేస్తున్న వైనం
-రాయలచెరువు నిండడానికి ప్రధానపాత్ర పోషిస్తున్న పిళ్లారికోన చెరువు మాయం
-చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఫారెస్ట్, నీటిపారుదల శాఖ అధికారులు
పున్నమి ప్రతినిధి ,ప్రతినిధి రామచంద్రపురం జూలై 23
రామచంద్రాపురం మండలంలో ప్రకృతి ప్రసాదించిన జలవనరులు, జీవ వైవిధ్యానికి నిలయమైన అటవీ భూములు కబ్జాకోరుల చెరలో చేరుతున్నాయి.మండలంలోని పిల్లారికోన చెరువుతో పాటు, దానికి ఆనుకుని అటవీ భూములు సైతం పూర్తిగా అన్యాక్రాంతమైపోతున్నాయి.నెత్తకుప్పం లెక్కల దాకలలో సర్వేనెంబర్ 306,309 లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ జీవనాధారమైన చెరువుపై, పరిసర ప్రాంతాలపై అక్రమార్కులు పిల్లాడుకోన మురళి కన్నేశారు. చుట్టూ దట్టమైన అడవుల మధ్య చెరువు ఉంది. ఇక్కడినుండే రాయల చెరువుకు అధిక శాతంలో వర్షం నీరు చేరుతుంది. అయితే ప్రస్తుతం మురళి అధికార నాయకుడినంటూ దర్పం ప్రదర్శిస్తూ, పట్టపగలే దర్జాగా హిటాచి, జేసీబీలతో ప్రకృతి వనరులను, ప్రభుత్వభూములను చదును చేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
గతప్రభుత్వం అలా..
పుల్లమ్మ నాయుడు కండ్రిగ పంచాయతీ, పిల్లారికోన చెరువును గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో పూడికలు తీసి, కట్ట మరమ్మత్తులు, వంటి ఉపయోగకర పనులతో అమృత సరోవర్ కార్యక్రమంతో చెరువును సమృద్ధిగా నీరు నిలువుండేట్లు వృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి వర్షాలు కురువకపోవడంతో చెరువులో నీటి శాతం పూర్తిగా అడుగంటిపోవడంతో కొందరు టిడిపి సానుభూతిపరుల కన్ను చెరువు పై పడింది. ఇదే అదునుగా భావించి, అధికారులకు మామూలుఇచ్చి, నాయకుల అండదండతో చెరువు చుట్టుపక్కలన్న ఫారెస్ట్ గుట్టలను భారీ యంత్రాలతో చదును చేసి పిల్లారికోన చెరువు నిండి రాయలచెరువు వెళ్లే మోరవ సైతం ఆక్రమించుకోవడం స్థానికులు తీవ్రంగా కలచి వేస్తోంది.
ఫారెస్ట్ భూమి సైతం ఆక్రమణ
ఒకవైపు చెరువు మోరవను పూడ్చివేస్తూ చెరువుకు ఆనుకుని ఉన్న ఫారెస్ట్ భూమిని సైతం వదలడం లేదు. ప్రభుత్వ నిబంధనలను చట్టాలను తుంగలో తొక్కుతూ అటవీ భూములను కబ్జా చేసి చదును చేస్తున్నారు.చుట్టుపక్కల ఉన్న గుట్టలను పట్టపగలే కొల్లగొడుతు పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన అటవీ ప్రాంతం, జలకళతో ఉండాల్సిన చెరువులు వాటిరూపు కోల్పోతున్నాయి.
ప్రశ్నిస్తే దౌర్జన్యాలే…
చెరువును, అటవీ భూములను కాపాడుకోవడానికి ముందుకు వస్తున్న స్థానికులు, రైతులపై అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మేము అధికార పార్టీ నాయకుల మంటూ స్థానికులను బెదిరింపులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చెరువు, ఫారెస్ట్ భూముల కబ్జాపై ఎవరైనా నోరుమెదిపితే దౌర్జన్యాలకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
నిద్రమత్తులో యంత్రాంగం?
ప్రభుత్వం భూసార పరిరక్షణకు, హరితహారం, అటవీ సంపద పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే… క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని ఈభారీ అక్రమ కబ్జా వ్యవహారంపై రెవెన్యూ, ఫారెస్ట్, అధికారులు మామూళ్ల మత్తులో జోగుడుతున్నారని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న చెరువును అటవీభూమిని పరిరక్షించాలని కోరుతున్నారు.






