హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టుకు వడ్డీ భారం నుంచి భారీ ఊరట లభించింది. తక్కువ వడ్డీకే రీఫైనాన్సింగ్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఎల్అండ్‌టీ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్య రూ.13,527 కోట్ల భారీ టర్మ్ లోన్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాలపరిమితికి ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
గతంలో బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు గరిష్టంగా 9.5 శాతం వరకు ఉండగా, తాజా ఒప్పందంతో ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి వార్షికంగా 3.5 శాతం వడ్డీకే రుణం లభించనుంది. దీనివల్ల పాత రుణాలు, కమర్షియల్ పేపర్లు పూర్తిగా తీరిపోనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మెట్రో ప్రాజెక్టుకు ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ ద్వారా గణనీయమైన ఆర్థిక స్థిరత్వం, ఊరట లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు.


