పెనుబల్లి / ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీకి చెందిన తోట గౌతమ్ (16) శనివారం రాత్రి ఇంట్లో హీటర్ వైర్లను ప్లగ్‌లో పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో గౌతమ్ మృతి చెందాడు. గౌతమ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్న వయసులోనే విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విద్యుత్ పరికరాలను ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.



