ప్రపంచవ్యాప్తంగా శాంతిని మరియు వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ స్నేహ దినోత్సవం జరుపుకుంటారు. 1958లో పరాగ్వే దేశంలో డాక్టర్ రామోన్ ఆర్టెమియో బ్రాచో స్నేహితులతో కలిసి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా ప్రతిపాదించారు. దీనిని గుర్తిస్తూ 2011లో ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. దీనితో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జూలై 30 న నిర్వహిస్తున్నారు. అయితే 1935లోనే అమెరికా ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అందరికీ ఆదివారం సెలవు దినం కావడం వల్ల స్నేహితులంతా ఒకచోట చేరి సమయాన్ని గడపడానికి వీలుగా ఈ రోజును ఎంచుకున్నారు. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే భారతదేశం మరియు అనేక ఆసియా దేశాలు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటున్నాయి. భారతదేశంలో 2026 సంవత్సరానికి గానూ ఫ్రెండ్‌షిప్ డే ఆగస్టు 2, ఆదివారం నాడు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ కవిత
🌹🌹🌹🤝🤝🤝🤝🤝🌹🌹🌹
కలకాలం కమనీయ బంధం
ఆద్యంతం సుమధుర సుగంధం
వయసు లింగభేదేతర సంబంధం
ప్రోత్సాహక ఉత్సాహ ప్రబంధం
ఫలితాన్ని ఆశించని సంబరం
మధురానుభూతుల గోపురం
ఎదురయ్యే కష్టసుఖాల్లో నిబ్బరం
జీవితసాఫల్యానికి ఒక గొప్ప వరం
సహవాస సహకార సూచికం
వెలుగు జగతికి శ్రేయోదాయకం
నిత్య యవ్వన మనోధైర్యాత్మకం
ఉల్లాసభరిత చిలిపి తలపుల పూనకం
కలిసిమెలసి సాగే జీవన గమనం
కల్మషం లేని చిరునవ్వుల పయనం
మనోభావాల సంక్షేమ సమన్వయనం
నిరంతర ఆనంద హరివిల్లుల నయనం
స్వార్థరహిత సారూప్య అభిమతం
మొహమాట ఆటలులేని అమృతం
మౌనరాగంతో మురిపించే ప్రియగీతం
స్నేహించిన జీవితం ఉల్లాసాన్వితం
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

