*సింగరేణికి హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి*
మే 11 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
సింగరేణి,
గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామంలో ప్రత్యేక హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌ను సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
సింగరేణి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్‌కు సొంత భవనం లేకపోవడంతో గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భరత్‌నగర్ కాలనీలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
వినతిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సంబంధిత అధికారులతో చర్చించి, సింగరేణి గ్రామానికి హెల్త్ సబ్ సెంటర్ అవసరాన్ని గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి (డీఎంహెచ్ఓ) ప్రతిపాదనలు పంపించడం అభినందనీయమని సర్పంచ్ తెలిపారు.
గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చొరవతో త్వరలోనే సింగరేణి గ్రామానికి హెల్త్ సబ్ సెంటర్ మంజూరై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున తమ విజ్ఞప్తిని స్వీకరించి వెంటనే చర్యలు చేపట్టిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


