టీటీడీ కళ్యాణ మండపం పక్కన భూ వ్యవహారం.. వాస్తవాలేంటి..?
– సర్వే నెంబర్ 165 జర్నలిస్టుల కాలనీలో భూములపై అనుమానాలు
– ప్రభుత్వ రికార్డులతో నిజానిజాలు తేల్చాలని డిమాండ్
– జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి
విజయనగరంజిల్లా బ్యూరో/రమణ, జూలై 28 (పున్నమి )
విజయనగరం–గిడిజాల జంక్షన్ ప్రధాన రహదారిపై టీటీడీ కళ్యాణ మండపానికి ఆనుకుని ఉన్న జర్నలిస్టుల కాలనీలో ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
గతంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో పలువురికి స్థలాల పట్టాలు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ కాలనీలోని కొన్ని స్థలాలు అక్రమంగా ఆక్రమించబడ్డాయనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.
ఈ భూములు ప్రభుత్వ భూములా, గడ్డ పోరంబోకు భూములా, గైరాన్ భూములా లేదా ఇతర రెవెన్యూ భూములా అనే అంశంపై రెవెన్యూ శాఖ అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
ఒకవేళ ప్రభుత్వ భూములపై ఎవరైనా అక్రమంగా ఆక్రమణలు చేసి ఉన్నట్లు విచారణలో తేలితే, సంబంధిత వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు స్పందించి సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. విచారణ అనంతరం అధికారికంగా వెలువడే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని వారు అభిప్రాయపడుతున్నారు.



