ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం
ఆత్మకూరు/సంగం, జూలై 17 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
సంగం మండల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరవేయాలని ఎంపీపీ కంట్టాబత్తిన పద్మావతమ్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నెల్లూరు జిల్లా సంగం మండలంలోని వెలుగు కార్యాలయంలో ఎంపీపీ కంట్టాబత్తిన పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ రహదారుల అభివృద్ధి, విద్య, వైద్య సేవలు, వ్యవసాయం, విద్యుత్, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీపీ సూచించారు.
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, తహసీల్దార్ సారంగపాణి, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

