ఖమ్మం నగరంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే చివరి రోజు గణనాథుల నిమజ్జనం ఎక్కడ నిర్వహించాలనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది. మున్నేరు నదిలో నీటి కొరత కారణంగా అధికారులు దంసలపురం చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అయితే చెరువులో చేపల పెంపకం చేస్తున్నామని, విగ్రహాల నిమజ్జనం వల్ల చేపలు చనిపోయి సుమారు 80 కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉందని చేపల పెంపకందారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పై ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో మున్నేరు నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నిమజ్జనం దంసలపురం చెరువులోనా? లేక ప్రతిసారి నిర్వహించే మున్నేరులోనేనా? అనే సందేహం భక్తుల్లో నెలకొంది. అధికారులు వెంటనే స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.



