ఆర్డీఓకు అప్పారావుపాలెం ఎస్సీ కాలనీ ప్రజల వినతి
ఆత్మకూరు, జూలై 28 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ నిధులతో మంజూరైన సీసీ డ్రైనేజీ పనులను ఆమోదించిన వర్క్ ఆర్డర్‌కు అనుగుణంగానే చేపట్టాలని కోరుతూ ఎస్సీ కాలనీ ప్రజలు మంగళవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో అందజేశారు.
ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలు కావాలని గ్రామస్థులు కోరారు. ఇప్పటికే ఆమోదించిన వర్క్ ఆర్డర్‌కు విరుద్ధంగా డ్రైనేజీ పనులను ఇతర ప్రాంతంలో చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే నిలిపివేసి అసలు ప్రణాళిక ప్రకారమే పనులు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
డ్రైనేజీ మార్గంలో మార్పులు చేస్తే వర్షాకాలంలో వర్షపు నీరు ఎస్సీ కాలనీ వైపు మళ్లే ప్రమాదం ఉందని, దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులు గ్రామంలో అనవసర వివాదాలు, ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కూడా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఆర్డర్లో పేర్కొన్న విధంగానే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు జరిగేలా సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీఓను కోరారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్, మాతంగి మాధవ, గొర్రెపర్తి పెంచలయ్య, గొర్రెపర్తి సంపూర్ణ, కటారి దుర్గ, మాతంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


