*రోడ్లు ఎక్కడ……? డ్రైనేజీ ఎటు……..? కొండపల్లి మున్సిపాలిటీ, 19వ,వార్డులో నరకప్రాయంగా మారిన బతుకులు.*
*కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సిబ్బంది.*
*తక్షణమే చర్యలు చేపట్టాలని వాసుల డిమాండ్.*
ఎన్టీఆర్ జిల్లా.
(కొండపల్లి మున్సిపాలిటీ): సెప్టెంబర్, 29,
ఇబ్రహీంపట్నం,
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని,19వ వార్డు డివిజన్.
*ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు చూస్తుంటే అసలు మున్సిపాలిటీ ఉందా…..? లేదా……? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.*
నగరాలు, పట్టణాల అభివృద్ధి గురించి పాలకులు చెప్తున్న మాటలకు, ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా పోయింది.
కనుమరుగైన రోడ్లు
చెరువులను తలపిస్తున్న వీధులు:
19,వ డివిజన్లో అసలు రోడ్లు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఉన్న రోడ్లు ఇప్పుడు గుంతలమయంగా మారి, పూర్తిగా కనుమరుగైపోయాయి. కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా దెబ్బతిన్న ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే స్థానికులు జంకుతున్నారు. చిన్నపాటి వర్షం వస్తే చాలు..
ఈ రోడ్లన్నీ బురదమయంగా మారి, వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.
రోడ్లపైకి మురుగునీరు.
అంధకారంలో డ్రైనేజీ వ్యవస్థ:
వార్డులో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. మురుగునీరు సజావుగా సాగిపోవడానికి కాలువలు (డ్రైన్లు) లేకపోవడంతో, ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా రోడ్లపైకే చేరుతోంది.
దీంతో వీధులన్నీ మురుగు కూపాలుగా మారి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి.
ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి, స్థానికులు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడడం లేదు:
ఈ సమస్యలపై వార్డు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, మున్సిపల్ సిబ్బంది గానీ, సంబంధిత అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
సమస్య తీవ్రతను వివరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప, కనీస పారిశుధ్య చర్యలు కూడా చేపట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
తక్షణమే చర్యలు చేపట్టాలి:
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న,19,వ వార్డు డివిజన్ ప్రజలు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. యుద్ధప్రాతిపదికన కనుమరుగైన రోడ్లను పునరుద్ధరించి, మురుగునీరు పోవడానికి శాశ్వత డ్రైనేజీ మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని, తమ వార్డును నరకకూపం నుండి విముక్తి చేయాలని 19,వ వార్డు ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.




