ఖమ్మం, జూలై 26
తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బీజేపీ మండల కిసాన్ మోర్చా నాయకులు కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిరిపురం ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, అన్నారుగూడెం–గోపాలపేట క్లస్టర్‌కు పూర్తిస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను నియమించాలని, మండలంలో వ్యవసాయ శాఖ ఖాళీలను భర్తీ చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అలాగే బంగారు తాకట్టు రుణాల రెన్యూవల్ నిబంధనలను సడలించాలని, సీతారామ ప్రాజెక్టు పనుల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, అన్నారుగూడెం–మల్లారం కాలువ వద్ద రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చల్లా నాగులు, ఆపతి వెంకట రామారావు, పెరిక కిరణ్ కుమార్, రాయల రమేష్, చల్లా వెంకట్, గొర్ల మోహన్ రెడ్డి, వేముల వెంకటనారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.



