రూ.6.87 కోట్ల ఆస్తులు.. ఏవోపై ఏసీబీ కేసు!
ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏవో దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సహచరులకు సంబంధించిన మరో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో భారీగా ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కర్మాన్‌ఘాట్‌లో రెండు ఫ్లాట్లు, సరూర్‌నగర్‌లో G+3 పెంట్‌హౌస్, యాచారం మండలం నల్లవెల్లి గ్రామ పరిధిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, బాలాపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
రూ.6.87 కోట్ల ఆస్తులు గుర్తింపు
నగదు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలు తదితరాలను కలిపి సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా 46 తులాల బంగారాన్ని కుదువపెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నట్లు కూడా సోదాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
గతంలోనూ కేసు
దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై గతంలో 2009లోనూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుత కేసులో గుర్తించిన ఆస్తులు ఆయన చట్టబద్ధమైన ఆదాయానికి అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల్లో లభించిన పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.




