ఖమ్మం, జూలై
కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
బుధవారం ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికను వదిలి వీధి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చే వైఖరిని ప్రజలు సమర్థించరని పేర్కొన్నారు.
దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కుట్రలు, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే రాజకీయాలు, బాధ్యతారాహిత్య ధోరణులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, శ్రీకాంత్, సాయిరాం, ధనియాకుల వెంకటనారాయణ, టీ. వీరభద్రం, ఉపేందర్, అల్లిక అంజయ్య, ఆర్.వి.ఎస్. యాదవ్, బండ్ల రిగన్ ప్రతాప్, బోయినపల్లి సురేష్, వీరవెల్లి రాజేష్, కొణతం లక్ష్మీనారాయణ, పిల్లలమర్రి వెంకట రామకృష్ణ, నరేష్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు.



