పున్నమి ప్రతినిధి,తిరుపతి, కల్చరల్ జూలై 21
అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గరుడ అవార్డ్స్‌లో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో మంగళవారం ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటిక ప్రదర్శించబడింది. తల్లి ఔన్నత్యాన్ని, ఆమె త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన ఈ నాటికకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఆచార్య ఉమా మహేశ్ అందించిన మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు రచన సమకూర్చారు.
జన్మనిచ్చిన తల్లిని భూమితో పోల్చిన ఈ నాటిక, “భూమి ఎంత తవ్వినా ఓర్చుకున్నట్లు, తల్లి కూడా పిల్లల బాధలను ఓర్చుకుంటుంది అనే భావాన్ని బలంగా చెప్పింది. గర్భగుడిలోని దేవతతో సమానమైన తల్లిని బలవంతంగా గుళ్ల చుట్టూ, ఇంటింటా తిప్పడం సరికాదని, పిల్లలే ఆమెను దర్శించి, సేవించి, ఆశీర్వాదం తీసుకోవాలని సందేశమిచ్చింది.
ఎంత దూరం వెళ్లినా తీరని రుణం తల్లిది. భువి కోరని భ్రమణాన్ని పిల్లలే అర్థం చేసుకోవాలి” అనేదే ఈ నాటిక ప్రధాన ఉద్దేశం.సమాజంలో పెరుగుతున్న వృద్ధుల నిర్లక్ష్యంపై చైతన్యం తీసుకురావడం, తల్లిదండ్రులను గౌరవించాల్సిన ఆవశ్యకతను యువతకు గుర్తు చేయడమే ఈ నాటిక లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కళాకారుల సహజ నటన, భావోద్వేగ సంభాషణలు ప్రేక్షకులను కదిలించాయి.
ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపకులు బి.ఎన్.రెడ్డి సభ్యులు, కళా ప్రియులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


