పోలీస్ స్టేషన్ల తనిఖీలు
ప్రొద్దుటూరులో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, అలాంటి అలవాట్లు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


