ప్రధాన రహదారిపై వారాంతపు సంతను తొలగించాలి
ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం
జీడిమెట్ల: సుచిత్ర–కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలోని కృష్ణానగర్–జయరాంనగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వారాంతపు సంత కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని జీడిమెట్ల 132వ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సమస్యపై సోమవారం ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వీరారెడ్డి నరేందర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న వారాంతపు సంతను తొలగించి, సంత నిర్వహణకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు.
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంత కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులు రహదారిపైకి రావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని వీరారెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజల భద్రత, సౌకర్యం, సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారాంతపు సంత నిర్వహణకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి, ఇకపై అక్కడే సంత నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాముడు యాదవ్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


