పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జి.ఎల్.కె. ప్రసాద్
ఆధ్వర్యంలో పొగాకు రైతులకు పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ శ్రీ జి.ఎల్.కె. ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో కలిగిరి పొగాకు బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీ జి. రాజశేఖర్, కేవీకే నెల్లూరు శాస్త్రవేత్త శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, వింజమూరు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శేషగిరి రావు, పశుసంవర్ధక శాఖ అధికారి డా. ఎం. మధు, రీజినల్ మేనేజర్ కార్యాలయ వేలం నిర్వహణాధికారి శ్రీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శ్రీ జి.ఎల్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది పొగాకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక బ్యారన్‌కు 21 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు అనుమతించిన పరిమాణానికి మించి పొగాకు సాగు చేయవద్దని సూచించారు. డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేసిన పొగాకుకు తగిన ధర లభించే అవకాశం ఉండదని తెలిపారు.రైతులు పొగాకు బోర్డు అనుమతించిన పరిమితి మేరకు మాత్రమే పొగాకు సాగు చేసి, మిగిలిన భూమిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే బ్యారన్ కవులు, పొలం కవులను తగ్గించుకోవడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి, పొగాకు సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు.వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శేషగిరి రావు మాట్లాడుతూ, ప్రస్తుతం అనేక మండలాల్లో పొగాకు సాగు అధికంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సాగు పెరగడంతో డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో రైతులు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని సూచించారు.
కేవీకే నెల్లూరు శాస్త్రవేత్త శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేల రకం, నీటి వసతి, వర్షపాతం, మార్కెట్ డిమాండ్, విత్తే సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మిరప, కంది, పెసర, మినుము, ఉలవ, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, రాగి, జొన్న, మొక్కజొన్న, ధనియాలు తదితర పంటలను పొగాకుకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు.ప్రస్తుతం జొన్న సాగు అనుకూలంగా ఉందని, నవంబర్ మొదటి వారంలో జొన్న విత్తుకోవచ్చని సూచించారు. నంద్యాల తెల్లజొన్న–5 రకాన్ని సాగు చేస్తే ఎకరాకు సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే అవకాశం ఉందని వివరించారు. జొన్నకు ప్రస్తుతం క్వింటాలుకు రూ.4,023 మద్దతు ధర ఉందని తెలిపారు. జొన్న పంట బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోగలదని, రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.పశుసంవర్ధక శాఖకు చెందిన డా. ఎం. మధు, కొండాపురం మరియు దుత్తలూరు మండలాల పశుసంవర్ధక అధికారి మాట్లాడుతూ, పొగాకు సాగును తగ్గించి, ప్రత్యామ్నాయంగా పశుపోషణ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఒక ఎకరా పొగాకు సాగుతో సమానమైన ఆదాయాన్ని పొందే విధంగా 2 ముర్రా జాతి గేదెలు, 2 జెర్సీ ఆవులు, 20 నెల్లూరు జాతి గొర్రెలు, 20 స్థానిక జాతి మేకలు లేదా 1,000 ఆశీల్/గిరిరాజ/వనరాజ జాతి కోళ్ల పెంపకం వంటి యూనిట్లను చేపట్టవచ్చని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా పశుగ్రాస విత్తనాలను వినియోగించుకుని జొన్న, మొక్కజొన్న, అలసంద తదితర పశుగ్రాస పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చి మేత కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే సబ్సిడీపై అందుబాటులో ఉన్న పశువుల దాణాను వినియోగించుకుని పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవాలని సూచించారు.MGNREGS శాఖ సమన్వయంతో హరిత గోపాలం కార్యక్రమం కింద, అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా డైరీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్లను వివిధ సబ్సిడీ పథకాల ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.గొర్రెలు, మేకలకు పశు భీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. రైతు వాటాగా ఒక్క గొర్రె/మేకకు రూ.27 ప్రీమియం చెల్లిస్తే, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఒక్క జీవానికి రూ.6,000 వరకు బీమా పరిహారం పొందే అవకాశం ఉందని వివరించారు.ఈ సందర్భంగా ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీ జి. రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రతి పొగాకు రైతు పొగాకు సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించుకుని, తన భూమి, నీటి వనరులు మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కనీసం ఒక ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులు ఆదాయ వనరులను విస్తరించుకుని, పొగాకు మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు.



