అనపర్తి, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలో ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా కుతుకులూరు గ్రామానికి చెందిన 16 చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.25,000 చొప్పున నగదు జమ కావడంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పులగుర్త చేనేత కార్మికుల సొసైటీకి చెందిన కుతుకులూరు గ్రామ చేనేత కార్మికులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.



