– ఈనెల 20 లోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించేందుకు చర్యలు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*
కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 6 :*
గండేపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర లిఫ్ట్ పనుల ప్రగతిని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలవరం ఈఈ రాజేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు, మెగా కంపెనీ ప్రతినిధి సతీష్ తో కలిసి తాళ్లూరు లిఫ్ట్ నుండి సీతారాంపురం డెలివరీ పాయింట్ వరకు జరిగిన పనులను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ మొదటి పైప్ లైన్ పనులు పూర్తి కావస్తున్నాయని, సెప్టెంబర్ 15 నుండి 20 లోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించేందుకు ఎలక్ట్రికల్ అధికారులతో చర్చించామని అన్నారు. రేపు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పనుల సమగ్ర నివేదిక అందిస్తామని తెలిపారు. 20వ తేదీలోపు మొదటి పైప్ లైన్ ప్రారంభించి ముందుగా చెరువులు, ఆరుతడి పంటలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ ను బట్టి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారా లేక ఎవరు ప్రారంభిస్తారని అనేది రేపు అమరావతిలో చర్చించిన తర్వాత తెలుస్తుందని స్పష్టం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ రైతుల చిరకాల సాగునీటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఇరిగేషన్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


