తాళ్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 28 : తాళ్లపూడిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర సుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమం పార్టీకి దిశానిర్దేశం చేసే మహత్తర వేదిక అని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన పట్ల ఎన్టీఆర్ చూపిన నిబద్ధత పేదలు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆయన జీవితం, ఆదర్శాలు నేటి తరానికి అపారమైన స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రజల కోసం కన్న కలలను సాకారం చేసేందుకు కట్టుబడి పనిచేస్తోందన్నారు.
వందలాది అభిమానులు “జై ఎన్టీఆర్” నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తెలుగు జాతి గర్వకారణమైన ఎన్టీఆర్ తెలుగు సినిమాతో పాటు రాజకీయ రంగానికీ కొత్త దిశను చూపిన మహానుభావుడని నాయకులు అభివర్ణించారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే సంక్షేమ స్ఫూర్తితోనే నేటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, తెలుగు సంస్కృతి ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు నాయకులు, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభను నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



