గూడూరు: పట్టణంలోని ఎస్. కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెకెసి మరియు సిఐఐ- ఎంసిసి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు అయిన టాటా ఎలక్ట్రానిక్స్, హోసూర్, టి.వి.ఎస్, ఎం.ఆర్. ఎఫ్, డైకిన్, బ్లూ స్టార్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. మొత్తం 44 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 26 మందిని ఎంపిక చేసినట్లు వివిధ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి జాబ్ డ్రైవ్ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి తమ నైపుణ్యాలను పెంపొందించుకొని జీవితాలకు బంగారు బాట వేసుకోవాలని, అదేవిధంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, జెకెసి కోఆర్డినేటర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, పట్టణ సీఐ శ్రీనివాసులు, వివిధ సంస్థల ప్రతినిధులు అయిన విమల ప్రియ, నాగరాజు, తులసి, యమున, జయప్రకాష్, నాగరాజు, హెచ్ఆర్ మేనేజర్లు, కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



