ఆత్మకూరు, జూలై 31 (హరికిరణ్,పున్నమి ప్రతినిధి): జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఆత్మకూరు ప్రాంతంలోని ఏపీయుడబ్ల్యూజే (APUWJ), ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF) జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, మద్దతుదారులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని కార్యాలయ ఈవోకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, జీవనోపాధికి ఉపయోగపడే సాగుభూమిని అందించడం, ఆత్మకూరులో శాశ్వత ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన కోర్కెలను త్వరితగతిన నెరవేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.


