*ఘనంగా హతీరాం బావాజీ 597వ జయంతి వేడుకలు*
*– బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను* *కాపాడుకోవాలి: డాక్టర్ బాధావత్ రవి*
*– ప్రత్యేక పూజలు నిర్వహించిన సాధు సంత్‌లు, గిరిజన పూజారులు*
జులై 19 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ప్రియమైన భక్తుడిగా, భక్తి పరాకాష్టకు ప్రతీకగా నిలిచిన శ్రీ హతీరాం బావాజీ 597వ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధు సంత్‌లు, గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు, భజనలు, మంగళహారతులు నిర్వహించి హతీరాం బావాజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బాధావత్ రవి మాట్లాడుతూ, బంజారా సమాజానికి హతీరాం బావాజీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. భక్తి, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నేటి యువత తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మరువకుండా వాటిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామితో పాచికలు ఆడేంతటి అపార భక్తిని సంపాదించిన మహనీయుడు హతీరాం బావాజీ అని, ఆయన భక్తి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. బంజారా జాతి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంలో హతీరాం బావాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
అనంతరం హతీరాం బావాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భక్తులకు ప్రసాదాల పంపిణీ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బావాజీ ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, బంజారా సంఘ ప్రతినిధులు, సాధు సంత్‌లు, యువత, మహిళలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. హతీరాం బావాజీ బోధించిన భక్తి, సేవా మార్గాన్ని అనుసరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.



