ముథోల్, సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి :మండల కేంద్రమైన ముథోల్తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రైతులు సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి స్థానిక ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన తోరణాల వద్ద బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బసవన్నలకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయంలో తమకు అండగా నిలిచే పశువులను గౌరవించుకోవడం ఈ పండుగ ప్రత్యేకతగా నిలిచింది. రైతులు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొని సంప్రదాయాలను కొనసాగించారు. పలు గ్రామాల్లో ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గ్రామ కూడళ్లలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



