ఇల్లు ధ్వంసం.. ఇద్దరు మహిళలకు గాయాలు
ఆత్మకూరు, ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని తూర్పు వీధిలో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీకేజీతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంటి యజమాని లక్ష్మమ్మతో పాటు జమీల అనే మహిళకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమై, ఇంట్లోని సామగ్రి శిథిలాల కింద పడిపోయింది.
స్థానికుల వివరాల మేరకు.. తూర్పు వీధిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ ఇంట్లో గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు అనుమానం వచ్చింది. దీంతో సహాయం కోసం జమీల అనే మహిళను పిలిచింది. జమీల ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు, గోడలు కూలిపోవడంతో పాటు ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి.
పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల మధ్య ఉన్న ఇద్దరు మహిళలను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలిన ప్రాంతాన్ని పరిశీలించి, ధ్వంసమైన ఇంటి పరిస్థితిని పరిశీలించారు. పేలుడు జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు




