పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల నమోదు, హాజరు, గత విద్యా సంవత్సరం ఫలితాల సమీక్ష, సిలబస్ పూర్తి, అభ్యసన లోపాలు, క్లిష్టమైన అంశాలు, తదుపరి నెల పాఠ్య ప్రణాళికపై చర్చించారు. జీసీడీఓ పుష్ప, ఎంఈఓ – 1 ఖాజా మొయిద్దీన్, ఎంఈఓ – 2 ఈశ్వరయ్య సమావేశాన్ని పర్యవేక్షించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 100 శాతం స్ట్రీమ్ పాఠశాలలపై దృష్టి, కార్యాచరణ ప్రణాళిక, ఎండ్‌లైన్ పరీక్ష ఫలితాల విశ్లేషణ తదితర అంశాలను వివరించారు. సెకండరీ స్థాయిలో మిషన్ మార్చ్ ఎస్ఎస్సీ – 2027 అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఫలితాల విశ్లేషణ, సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పరీక్షలకు ముందు వేగవంతమైన పునశ్చరణ, ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించే విధానాలపై అవగాహన కల్పించారు. వెంకటరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీటీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ – 1 ఖాజా మొయిద్దీన్ తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణలో చురుకుగా పాల్గొని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్, అమర్నాథ్, ఐఈడీ ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, చిట్వేల్, పెనగలూరు మండలాల గణిత, సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, సీఆర్పీ చంద్ర పాల్గొన్నారు.




