కొత్తపల్లి గ్రామసభలో “తెలంగాణ జలసిరి”పై విస్తృత అవగాహన
కొత్తపల్లి గ్రామంలో ఉపసర్పంచ్ కాలే అనిత–రమేష్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “తెలంగాణ జలసిరి” కార్యక్రమం నేపథ్యంలో గ్రామ ప్రజలకు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి వినియోగం, సాగునీటి నిర్వహణపై అవగాహన కల్పించారు.
సమావేశంలో గ్రామాభివృద్ధికి నీటి వనరుల పరిరక్షణ ఎంత ముఖ్యమో వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు, బోర్బావుల రీఛార్జ్ నిర్మాణం, చెరువులు, కుంటల సంరక్షణ, వర్షపు నీటిని వృథా కాకుండా భద్రపరచడం వంటి అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ గ్రామసభలో వార్డు సభ్యులు, తలారి సత్యనారాయణ, వంగ సంజీవరెడ్డి, పోలే శివ, కంబాలపల్లి కుమార్, గ్రామ పెద్దలు చిక్కుడు శేఖర్, కాలే రమేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, గ్రామ ప్రజలు తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.



