ఒక ఇంటికి – ఒక కిచెన్ గార్డెన్ లక్ష్యం
వేముల మండలంలో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన
వేముల, ఆగస్టు 13: వేముల మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవన్‌లో మహిళా సంఘాల సభ్యులకు “ఒక ఇంటికి – ఒక కిచెన్ గార్డెన్” కార్యక్రమంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెలుగు–DRDA అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ డేరంగుల ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రతి డ్వాక్రా మహిళా కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుకోవాలని సూచించారు. “మన ఇంటి కూరగాయలు – మన ఆరోగ్యానికి భరోసా” అనే నినాదంతో కిచెన్ గార్డెన్‌లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
కిచెన్ గార్డెన్‌ల ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడంతో పాటు కూరగాయల కొనుగోలు ఖర్చులు తగ్గి, ఆరోగ్యకరమైన ఆహారం ఇంటి వద్దే లభిస్తుందని వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో వేముల మండలంలో 1,000 డ్వాక్రా మహిళా కుటుంబాల్లో కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటు లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్యలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయ అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి వసంత కుమారి మాట్లాడుతూ, కిచెన్ గార్డెన్‌ల ద్వారా తాజా, రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగుపై అవగాహన పెరగడంతో పాటు ఇంటి వ్యర్థాలను కంపోస్ట్‌గా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
కిచెన్ గార్డెన్‌లలో టమాటా, వంకాయ, బెండకాయ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బీరకాయ, దొండకాయ, సొరకాయ తదితర కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకోవచ్చని తెలిపారు.
గ్రామ సమాఖ్య స్థాయిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, యూనిట్ ఇన్‌చార్జిలు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు, ప్రకృతి వ్యవసాయ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ జ్యోతి, వేముల గ్రామ సమాఖ్య అసిస్టెంట్, ఐసీఆర్‌పీ రాజీవ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.








