రంగంపేట, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, IAS సూచించారు. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పంట అనంతరం అపరాల పంట సాగు చేసిన పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి అపరాల పంట సాగు విధానం, పెట్టుబడులు, దిగుబడులు, ప్రకృతి వ్యవసాయం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.



