*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*
*పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల కేటాయింపుపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చ :- మార్కాపురం జిల్లా ఇన్చార్జి డీఆర్వో ఎం. వెంకట శివరామిరెడ్డి*
*తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి రాజకీయ పార్టీల ప్రతినిధులు*
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, ఓటర్ల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం మార్కాపురం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి డీఆర్వో ఎం. వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చించారు.
ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించే విధానం, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనపై సమావేశంలో వివరంగా చర్చించారు.
పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఇతర అవసరమైన సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.
ఆయా గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ఓటర్లకు అందుబాటులో ఉండే ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాజకీయ పార్టీల నాయకులు అధికారులను కోరారు.
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, తాజా జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని వారు సూచించారు.
మార్కాపురం జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 990 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు సమావేశంలో తెలిపారు. అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 7,55,731 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారం అందిస్తూ, అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ పద్మావతి, ఎన్నికల విభాగం అధికారులు, అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


