తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఇంధన ధరల పెంపుపై మండల నాయకులు తిప్పన ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపుతూ జీవనాన్ని దుర్భరంగా మార్చాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు పెంచడంతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
ఒకవైపు కరువు, పంటనష్టం, నిరుద్యోగంతో రైతులు, కూలీలు ఆర్థికంగా కుదేలైపోతుంటే మరోవైపు ఇంధన ధరల పెంపుతో ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని మండిపడ్డారు. ఆటో, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు రోజురోజుకూ అప్పులపాలవుతున్నారని, బస్సు చార్జీలు, కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయని, ఈ విధానం ప్రజలపై ఆర్థిక దోపిడీగా మారిందన్నారు. ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ పెంచి పాత ధరలకు అందుబాటులోకి తేవాలని, రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్, గ్యాస్ సరఫరాను పెంచాలని కోరారు.

