బోధనా నైపుణ్యాల పెంపే లక్ష్యం.. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ పి. ఉద్ధవ్
ఆసిఫాబాద్, ఆగస్టు 3: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న గణిత, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు ఐదు రోజుల కెపాసిటీ బిల్డింగ్ & ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ (వృత్తాంతర శిక్షణ) కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏసీఎంఓ) పి. ఉద్ధవ్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటిడీఏ ఆదేశాల మేరకు రెండో విడతలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గణిత, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శిక్షణలో సబ్జెక్ట్ ఆధారిత బోధనా నైపుణ్యాల మెరుగుదల, సామర్థ్యాధారిత బోధన, అభ్యసన ఫలితాల సాధన, వినూత్న బోధనా పద్ధతులు, తరగతి గది నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యార్థి-కేంద్రీకృత బోధన, సామర్థ్యాధారిత అభ్యసనం వంటి అంశాలపై సబ్జెక్టు నిపుణులు, డీఆర్పీలు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణలో చురుకుగా పాల్గొని తమ బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ పి. ఉద్ధవ్ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.



