ఆత్మకూరు, జూలై 25 ( పున్నమి ప్రతినిధి )
ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మై టీడీపీ యాప్ వినియోగం, కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, వాటి వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. లబ్ధిదారుల అభిప్రాయాలు, ఫొటోలు, వీడియోలు, ప్రచార వివరాలను యాప్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాప్ లాగిన్, సమాచారం అప్లోడ్, లబ్ధిదారుల నమోదు, కార్యక్రమాల పురోగతి వంటి అంశాలను డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, బూత్ ఇన్చార్జులు, ఐటీ విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


