ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ బీఆర్టీయూ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు.
డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరల పెరుగుదల, విడిభాగాల ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఫైనాన్స్ ఈఎంఐల భారం, కుటుంబ పోషణ వంటి సమస్యలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు బాధాకరమని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించి శాశ్వత సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రమాద బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని, వారి సంక్షేమానికి బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి. ఖమ్మం నగరా అధ్యక్షులు పగడాల నాగరాజు, సుడ మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు

