మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు
త్వరలో అదుపులోకి తీసుకుంటాం: ఎస్సై జగదీష్
తిరుమలాయపాలెం, పున్నమి: సుద్దవాగు తండా గ్రామపంచాయతీ పరిధిలోని ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకుల కారుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్ హాజరై తిరిగి వెళ్తుండగా ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద వారి కారుపై రాళ్లతో దాడి జరిగినట్లు బోడ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భానోత్ కిషన్, బానోత్ మోహన్, బానోత్ రవి తండ్రి భీక్యా లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలో అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్సై జగదీష్ వెల్లడించారు.



