ప్రపంచవ్యాప్తంగా అనాథలు, రోగగ్రస్తులు మరియు పేద ప్రజలకు చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపు పొందిన గొప్ప మానవతావాది మదర్ తెరెసా. ఆమె అసలు పేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్షు. అల్బేనియా దేశంలో జన్మించినప్పటికీ, భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తా కేంద్రంగా తన జీవితాంతం సేవ చేసారు. ఆమె 1910 ఆగష్టు 26న ప్రస్తుత ఉత్తర మాసిడోనియాలోని స్కోప్జేలో జన్మించారు. 18 సంవత్సరాల వయసులో సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంస్థలో చేరి 1929లో భారతదేశానికి వచ్చారు. కడు పేదవారికి సేవ చేయడం కోసం ఆమె 1950లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ రోగులు, మరణశయ్యపై ఉన్న నిరుపేదల కోసం ఆశ్రమాలు మరియు అనాథ పిల్లలకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. తెరెసాకు ఆమె చేసిన అద్భుతమైన మానవ సేవకు గాను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. 1979లో ప్రపంచ శాంతి, మానవతా సేవలకు గాను నోబెల్ శాంతి పురస్కారం లభించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న 1980లో లభించింది. 1962లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు. ఆమె మరణానంతరం (సెప్టెంబర్ 5, 1997) 2016లో వాటికన్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఆమెను సెయింట్ గా అనగా పుణ్యవతిగ ప్రకటించారు. ఆగష్టు 26 థెరిసా జన్మదినం సందర్భంగా పున్నమి పాఠకుల కోసం ఈ కవిత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సకల పుష్పజాతి వికసించి పరిమళించిన వేళ
భూమాత ఓ కరుణామయిని ప్రసవించిన వేళ
పరవశించగ మాతృదేవత అవని ఆగమన వేళ
దీనజగత్ కు వెలుగునింప అభాగ్యులను ఆదరింప
జన్మించింది ఓ మమతల తల్లి మనస్సున్న జాబిల్లి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది
ఆగ్నెస్ జీవితంలో అది అందగిస్తుంది.
దేశం కాని దేశంలో స్థిరపడాలన్న కోరిక
కలకత్తా వాసులకు వరప్రసాద సేవిక
భారతీయులకు దైవమిచ్చిన కానుక
ఓ కల్పవృక్షపు కొమ్మ
మేళవించిన మమతాత్మక జన్మ
సేవలందించే అమ్మ
విద్యార్థిదశ లోనే సేవలమ్మ.
ఎవరి సేవలు ఆమె సేవలకు రావు సాటి
అజాత శత్రువులలో మదర్ మేటి.
అమ్మ హృదయలయలే శరణాలయాలు
అమ్మ ఆలోచనలే దీనుల విమోచనలు
అనాథల పట్ల అభాగ్యుల పట్ల
ఆలపించిన ప్రేమానురాగాలు
విశ్వ హృదయవీణను మీటిన
అనురాగ సేవా సరాగాలు.
హృదయం ఓ నిర్మల్ హృదయ్
అమ్మ తేజస్సు శాంతినిలయ్
మానవ సేవే మాధవ సేవ
ఈ భావం దైవ సన్నిధి త్రోవ
తన మార్గంలో దైవాన్ని దర్శించింది.
మదర్ను స్మరిద్దాం
సేవాతత్వాన్ని పెంపొందిద్దాం
సాటి జనులను ప్రేమిద్దాం
మదర్ మరళా జన్మిస్తుందని ఆశిద్దాం
మరువలేని మమకార రూపధారిణి అమృత వర్షిణి.. మదర్ థెరిసా.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


