Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌.. తెలంగాణలో భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌.. తెలంగాణలో భారీ వర్ష సూచన! మరిపెడ, పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం.. మహబూబాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక మరిపెడ, నవంబర్ 3: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ మురసు (MURASU) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరిపెడ మండల కేంద్రంతో పాటు బృహంతపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాన్‌ పేరు ఏమిటి? ఎలా ఏర్పడింది? ప్రస్తుతం ప్రభావం చూపుతున్న తుఫాన్‌ పేరు మురసు. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. భారతదేశం సూచించిన మురసు అనే పేరుకు తమిళంలో సంప్రదాయ యుద్ధ డప్పు లేదా పెద్ద డోలు అనే అర్థం ఉంది. ఈ తుఫాన్‌ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని నెల్లూరు నుంచి నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో నవంబర్ 3 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణపై తుఫాన్‌ ప్రభావం తుఫాన్‌ ప్రభావంతో నవంబర్ 3న తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుంది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ కాగా, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మరిపెడ, బృహంతపురం తదితర ప్రాంతాల్లో స్థానికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచిస్తున్నారు. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షాల నేపథ్యంలో రైతులు కోసిన వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. పత్తి పంటను తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో నిల్వ ఉన్న ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను భద్రపరచుకోవాలి. పంట ఉత్పత్తులను కవర్లతో కప్పి ఉంచుకోవాలి. ప్రజలకు సూచనలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా సురక్షిత భవనాల్లో ఉండాలి. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వాగులు, వంకలు, చెరువులు దాటే ప్రయత్నం చేయకూడదు. తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖతో పాటు జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు పాటించాలని కోరుతున్నారు. – పున్నమి ప్రతినిధి, మరిపెడ

మహబూబాబాద్

సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు స్వరం!

సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు స్వరం! మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై ఘాటు విమర్శలు.. నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందని ఆరోపణలు బీఆర్ఎస్ హయాంలో పూడికతీత చేసిన చెరువుల్లో నేడు నీళ్లు.. రైతులకు ఉపయోగపడుతున్నాయంటూ వ్యాఖ్యలు మునుగోడు, నవంబర్ 3: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సొంత ప్రభుత్వంపై, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూడికతీత చేసిన చెరువుల్లో ప్రస్తుతం నీళ్లు నిలిచి రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొంటూ గత ప్రభుత్వ పనులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ”ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏం మంత్రి అయ్యా.. ఆయన హుజూర్‌నగర్‌కే మంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికే మంత్రా? నిధులన్నీ కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకే తీసుకెళ్తున్నారు. మిగతా నియోజకవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించడం లేదు?” అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా నిధుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిని కాకపోవచ్చు, మంత్రిని కాకపోవచ్చు కానీ గుణంలో వారికంటే వంద రెట్లు గొప్పవాడినని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీసిన వ్యాఖ్యలు ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చెరువుల పూడికతీత పనుల వల్ల ప్రస్తుత వర్షాకాలంలో నీటి నిల్వలు పెరిగి రైతులకు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే చెప్పడం, మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి నిధులు కేటాయించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. అధికార పార్టీలోని ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. Uploaded Video:

మహబూబాబాద్

తెలంగాణలో సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ట ధరలు ఖరారు!

తెలంగాణలో సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ట ధరలు ఖరారు! రకాన్ని బట్టి కిలో రూ.66 నుంచి రూ.79 వరకు ధరల నిర్ణయం.. దుకాణాల్లో ధరల పట్టిక ప్రదర్శన తప్పనిసరి హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మార్కెట్లో బియ్యం ధరలు ఇష్టానుసారంగా పెంచి విక్రయించకుండా వివిధ రకాల సన్నబియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది. ఈ మేరకు బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు నిర్ణయించిన ధరలకు మించి విక్రయాలు జరపకూడదని స్పష్టం చేసింది. రకాల వారీగా గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: – BPT, KNM రకం సన్నబియ్యం కిలో రూ.66. – తెలంగాణ సోనా, RNR రకం కిలో రూ.74. – HMT, JSR రకం కిలో రూ.79. ఈ ధరలకు మించి బియ్యం విక్రయిస్తే సంబంధిత మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ప్రతి బియ్యం దుకాణంలో రకం వారీగా నిర్ణయించిన ధరల వివరాలను వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది. సన్నబియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ధరలను పరిశీలించి, నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరల నియంత్రణతో సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు మార్కెట్లో బియ్యం విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. నిర్ణీత ధరలకు మాత్రమే బియ్యం విక్రయించాలి.. వినియోగదారులను అధిక ధరలతో ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మహబూబాబాద్

రోడ్డుపై ప్రాణం పోతున్నా పట్టించుకోరా

*రోడ్డుపై ప్రాణం పోతున్నా పట్టించుకోరా..?* *ప్రమాద బాధితుడికి సకాలంలో సాయం అందక మృతి.. మానవత్వం ఎటుపోతోంది?* హైదరాబాద్, నవంబర్ 2 ; రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కానీ కరీంనగర్ జిల్లా పిట్లపల్లి వద్ద జరిగిన ఘటన ఆలోచింపజేస్తోంది. మల్లయ్య అనే వ్యక్తి బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. అటుగా వెళ్తున్న వారు సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించకపోవడంతో, చికిత్స అందడంలో ఆలస్యం జరిగి చివరకు మల్లయ్య మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. *చూస్తూ వెళ్లిపోవద్దు.. ప్రాణం కాపాడేందుకు ముందుకు రండి!* ప్రమాద బాధితుడిని చూసి మనకెందుకులే అని వెళ్లిపోవడం కంటే, వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించి వైద్య సహాయం అందేలా చూడటం ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాహ్‌వీర్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చే అర్హులకు నిబంధనల ప్రకారం నగదు ప్రోత్సాహకం అందించే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించాలి. గాయపడిన వ్యక్తికి మరింత హాని కలగకుండా జాగ్రత్తపడుతూ వైద్య సహాయం అందేలా చూడాలి. సహాయం చేసే వారికి చట్టపరమైన రక్షణలు కూడా ఉన్నాయి. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాల్సిన సమయం ఇది. ప్రమాదాన్ని చూస్తూ వెళ్లిపోవడం కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం. మనిషి ప్రాణం కంటే ఏ పని ముఖ్యం కాదు. మీ కళ్లముందు ప్రమాదం జరిగితే నిర్లక్ష్యం చేయకండి.. స్పందించండి, సాయం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి! Uploaded Video:

మహబూబాబాద్

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జిల్లా పోలీసు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా: 02.11.2026 *డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *మాదకద్రవ్య రహిత సమాజం కోసం 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన విజయలక్ష్మిని అభినందించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్* మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ఇందుకూరి విజయలక్ష్మి (62) సోమవారం మహబూబాబాద్ జిల్లా మీదుగా ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయలక్ష్మి చేపట్టిన సాహసోపేతమైన అవగాహన యాత్రను అభినందించారు. 62 ఏళ్ల వయస్సులోనూ సమాజ శ్రేయస్సు కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, యువతకు వివరించి, వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహబూబాబాద్‌లోని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఈ యాత్ర సందర్భంగా మహబూబాబాద్ టౌన్‌లో డీఎస్పీ తిరుపతిరావు, ఎస్సై అరుణ్, మరియు సూరయ్యల మార్గదర్శకత్వంలో పలు స్థానిక కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలను విజయలక్ష్మి నిర్వహించారు. లక్ష మంది విద్యార్థులకు అవగాహన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ఒక లక్ష మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో విజయలక్ష్మి ఈ సైకిల్ యాత్రను చేపట్టారు. అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ముగియనుంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విజయలక్ష్మి చేపట్టిన ఈ అవగాహన యాత్ర మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మహబూబాబాద్

నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి! నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. వరంగల్–ఖమ్మం–నల్గొండ, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినవారు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు లభించదు. 2023 అక్టోబర్ 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా అర్హత కలిగిన సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు, సంబంధిత నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసులుగా ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. కావున మరిపెడ మండలంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని అర్హులైన పట్టభద్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకొని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి: ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు, పట్టభద్రులు, యువతకు షేర్ చేసి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి. ఇట్లు, భూక్య రాము నాయక్ పున్నమి రిపోర్టర్ మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్

శబరిమల యాత్రికులకు తొలిసారిగా రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీ

*శబరిమల యాత్రికులకు తొలిసారిగా రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీ ; ప్రీమియం ఖర్చులను టిడిబి భరిస్తుంది.* తిరువనంతపురం: రాబోయే మండల-మకరవిళక్కు యాత్రా కాలంలో శబరిమల యాత్రికులకు రూ.2 లక్షల కవరేజీని అందించే కొత్త జీవిత బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ (TDB) ప్రకటించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సహకారంతో ప్రవేశపెట్టిన ఈ పథకం, యాత్ర సమయంలో మరణించిన భక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తిరువనంతపురంలో జరిగిన బోర్డు సమావేశం అనంతరం, శుక్రవారం (అక్టోబర్ 30) నాడు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. శబరిమల యాత్రికులకు జీవిత బీమా సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో, బోర్డు భక్తులకు ప్రమాద బీమా సదుపాయాన్ని అందించేది. కొత్త పథకం కింద, యాత్రికులు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా కవరేజీ పొందేలా చూసేందుకు, టిడిబి తన సంక్షేమ నిధి నుండి మొత్తం బీమా ప్రీమియంను భరిస్తుంది. యాత్రా కాలంలో బీమా ప్రీమియంల కోసం సుమారు రూ. 1 కోటి ఖర్చు అవుతుందని బోర్డు అంచనా వేస్తోంది. ఈ అమలులో భాగంగా, భక్తులు తమ శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునేటప్పుడు, తమ నామినీ పేరు మరియు సంబంధ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. యాత్ర సమయంలో యాత్రికుడు మరణించిన పక్షంలో, వర్తించే బీమా నిబంధనలకు లోబడి, నామినీకి లేదా అర్హులైన కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు అందుతాయి. యాత్రా కాలానికి సంబంధించిన సన్నాహాల గురించి ప్రస్తావిస్తూ, శబరిమలలో అరవణ ప్రసాదం నిరంతరాయంగా లభించేలా బోర్డు చర్యలు తీసుకుంటోందని జయకుమార్ తెలిపారు. ప్రస్తుతం , రోజుకు సుమారు రెండు లక్షల అరవాణ టిన్లు ఉత్పత్తి అవుతున్నాయి, ఈ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. కొత్తగా నిర్మించిన ఉత్పత్తి కేంద్రం నవంబర్ 3 లేదా 4 తేదీలలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది, దీనితో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుంది. 41 రోజుల మండల యాత్రా కాలానికి ముందు భక్తుల నుండి ఆశించే డిమాండ్ ను తీర్చడానికి , బోర్డు 50 లక్షల నుంచి 60 లక్షల టిన్ల నిల్వను నిర్వహించాలని యోచిస్తోంది. *నవంబర్ 10 లోపు యాత్రికుల సౌకర్యాలు సిద్ధం కానున్నాయి* నవంబర్ 10 లోపు శబరిమలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ మరియు మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టిడిబి కూడా కృషి చేస్తోంది. వచ్చే యాత్రికులకు సమాచారం, మార్గదర్శనం మరియు సహాయం అందించడానికి నీలక్కల్ మరియు పంపా వద్ద స్వాగత కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. యాత్రా కాలం ప్రారంభమయ్యేలోపు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోందని జయకుమార్ తెలిపారు. ఈ సీజన్లో ఎరుమేలిలో కేఐఐఎఫ్బి భవనాన్ని ఉపయోగించి విస్తృతమైన ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జయకుమార్ ప్రకటించారు. *డిజిటైజేషన్ ప్రాజెక్టును నేరుగా అమలు చేయనున్న టీడీబీ* శబరిమల సేవల ప్రతిపాదిత డిజిటలైజేషన్కు సంబంధించి, ఈ ప్రాజెక్టును ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నేరుగా అమలు చేస్తుందని జయకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో కేరళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (KINFRA) ప్రమేయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. డిజిటలీకరణ కార్యక్రమం ఎలాంటి సమస్యలు, జాప్యాలు లేకుండా ముందుకు సాగేలా చూసేందుకు బోర్డు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. జీవిత బీమా కవరేజీని ప్రవేశపెట్టడం, అరవాణ ఉత్పత్తిని పెంచడం మరియు కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదలలతో, 2026-27 మండల-మకరవిళక్కు యాత్రా కాలంలో అంచనా వేస్తున్న భారీ సంఖ్యలో భక్తులను నిర్వహించడానికి టిడిబి సన్నద్ధమవుతోంది.

మహబూబాబాద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓటు ఎటువైపు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓటు ఎటువైపు? నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, విద్యావంతుల సమస్యలే ప్రధాన చర్చ.. స్వతంత్ర అభ్యర్థి మెండేం కిరణ్ కుమార్ పోటీపై ఆసక్తి ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యువత, నిరుద్యోగులు, పట్టభద్రుల ఆలోచనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. తమ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే నాయకుడు ఎవరు? పట్టభద్రుల హక్కుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి ఎవరు? అనే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల పోటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండేం కిరణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం ఆసక్తిని కలిగిస్తోంది. నిరుద్యోగులు, యువత, పట్టభద్రులతో తనకు ఏళ్ల తరబడి అనుబంధం ఉందని, వారి సమస్యలను దగ్గరగా పరిశీలించానని ఆయన పేర్కొంటున్నారు. హామీల కంటే గతంలో చేసిన పనులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పట్టభద్రులను కోరుతున్నారు. యువత ముందున్న ప్రధాన ప్రశ్నలు ఏమిటి? నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామక ప్రక్రియలో పారదర్శకత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మెరుగైన సౌకర్యాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో భద్రత, విద్యారంగంలో నాణ్యమైన అవకాశాలు వంటి అంశాలు యువతకు కీలకంగా మారాయి. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా, ఎన్నికల అనంతరం వాటి అమలుకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది పట్టభద్రులు ఆలోచించాల్సిన అంశం. స్వతంత్ర అభ్యర్థికి ఎంతవరకు అవకాశం? రాజకీయ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి తన వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధం, గతంలో చేసిన సేవలు బలంగా మారవచ్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే విస్తృతమైన పట్టభద్రుల మద్దతు, క్షేత్రస్థాయిలో ప్రచారం, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల విశ్వాసం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. మెండేం కిరణ్ కుమార్‌కు ఎంతవరకు అవకాశం ఉందనేది ఆయనకు లభించే పట్టభద్రుల మద్దతు, ప్రచార ప్రభావం, ఇతర అభ్యర్థుల బలాబలాలపై ఆధారపడి ఉంటుంది. ఓటరు నిర్ణయమే కీలకం ఈ ఎన్నికల్లో పట్టభద్రులు కేవలం రాజకీయ గుర్తింపును మాత్రమే కాకుండా అభ్యర్థుల గత అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే స్వభావం, సమస్యల పరిష్కారం కోసం పోరాడే నిబద్ధతను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎవరు గెలిచినా నిరుద్యోగుల సమస్యలు, యువత భవిష్యత్తు, పట్టభద్రుల హక్కులు శాసనమండలిలో ప్రాధాన్యత పొందాలన్నది విద్యావంతుల ఆకాంక్షగా కనిపిస్తోంది. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీగా కాకుండా విద్యావంతుల సమస్యలు, నిరుద్యోగుల భవిష్యత్తు, యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం కల్పించే ఎన్నికలుగా మారుతున్నాయి. అభ్యర్థుల పనితీరు, హామీలు, కార్యాచరణను బేరీజు వేసుకుని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది. Uploaded Video:

మహబూబాబాద్

కేటీఆర్‌ను కలిసి పుట్టినరోజు ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

కేటీఆర్‌ను కలిసి పుట్టినరోజు ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో మర్యాదపూర్వక భేటీ.. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకైన పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్, అక్టోబర్ 31: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), ఆయన సతీమణి శైలిమ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్యవతి రాథోడ్ గారు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సత్యవతి రాథోడ్ గారు గతంలో మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా సమస్యలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై రాజకీయంగా చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా 2026 మే నెలలో చేపట్టిన పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్యవతి రాథోడ్ గారికి ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలను అప్పగించడం ఆమెపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా కీలక పాత్ర? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుల అనుభవాన్ని వినియోగించుకోవడం పార్టీకి ముఖ్యమైన అంశంగా మారింది. ఈ క్రమంలో సత్యవతి రాథోడ్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తరించడంలో మరింత కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడం, గిరిజన ప్రాంతాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాల్లో ఆమె అనుభవం పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి రాజకీయ పదవి లేదా అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సీనియర్ నాయకత్వంతో సత్సంబంధాలు.. పార్టీ భవిష్యత్తుపై ఆశలు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌తో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే దిశగా సత్యవతి రాథోడ్ గారి రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ఆమె ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Uploaded Video:

మహబూబాబాద్

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

*విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ చర్యలు తీసుకోవాలి* *ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?* *జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మరొకసారి టెస్టులు నిర్వహించాలి* *మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా చాలా ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రమాదాలకు గురవుతున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు మౌనం ఎందుకు :ఎస్ ఎఫ్ ఐ* *జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారని మండిపాటు* *తక్షణమే గీతాంజలి స్కూల్ గుర్తింపును రద్దు చేసి, పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ ఎఫ్ ఐ నేతలు డిమాండ్*