Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం..

అర్హులకు అన్యాయం.. అనర్హులకు ఇళ్ల మంజూరా? పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం… నిరుపేదలను పక్కనపెట్టి రాజకీయ అనుకూలులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆరోపణలు? అర్హులకు అందని ఇందిరమ్మ ఇళ్లు.. అనర్హులకు కేటాయింపులా? సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ పెద్దలాల్ తండా గ్రామస్తుల ఆగ్రహం సిరోల్ మండలం, మహబూబాబాద్ జిల్లా: పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేటాయింపులపై పెద్దలాల్ తండా గ్రామపంచాయతీలో వివాదం చెలరేగింది. నిజమైన నిరుపేదలకు, కనీసం నివసించడానికి సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్లు కేటాయించకుండా ఆర్థికంగా స్థితిమంతులైన వారికి, అధికార పార్టీకి చెందిన అనుకూల వ్యక్తులకు, సర్పంచ్, వార్డు సభ్యులకు ఇళ్లు కేటాయించారంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎన్నో పేద కుటుంబాలు నేటికీ సరైన నివాస సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరాల్సి ఉండగా, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో ఉన్నవారికి, ప్రజాప్రతినిధులకు ఇళ్ల కేటాయింపులు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలను పక్కనపెట్టి రాజకీయ అనుబంధాలు, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్దేశం నిరాశ్రయులకు, పేదలకు గృహ వసతి కల్పించడమేనని, కానీ అర్హులైన పేదలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల ప్రయోజనం ఎవరికి అందుతున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది బాధ్యతలపై ప్రశ్నలు! గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతల పరిశీలన, సంబంధిత రికార్డుల నిర్వహణ, అధికారిక ప్రకటన వంటి ప్రక్రియల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది, అధికారుల బాధ్యత ఏమిటనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? క్షేత్రస్థాయిలో నిజమైన నిరుపేద కుటుంబాల పరిస్థితులను పరిశీలించారా? అర్హతల జాబితాను పారదర్శకంగా రూపొందించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇచ్చారా? ఆర్థికంగా బాగున్నవారికి, ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఇళ్లు కేటాయించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు మాత్రం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టాలి? పెద్దలాల్ తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని, ఎంపికైన ప్రతి లబ్ధిదారుడి అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది, ఎంపిక ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల నుంచి వివరాలు సేకరించి విచారణ జరపాలని కోరుతున్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అర్హత లేని వారికి కేటాయింపులు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిపోర్టర్: భూక్య రాము నాయక్ సిరోల్ మండలం – మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.

_*తెలంగాణలో శాంతిభద్రతలు కరువు..*_ _*మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసి పది రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్*_ _*తెలంగాణ భవన్ | హైదరాబాద్ | 04-11-2026*_ _హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు_ _ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం_ _మహిళలు, ఆడపిల్లలకు తల్లిదండ్రులు పక్కన ఉన్నా లేకపోయినా ప్రభుత్వమే రక్షణ కవచంగా ఉండేలా చర్యలు చేపట్టాం. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో శాంతి లేదు.. భద్రత లేదు.. మహిళలకు రక్షణ లేదు. మహిళలపై వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు_ _ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదు_ _హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్ తనపై జరుగుతున్న వేధింపులు, ఇబ్బందులపై పది రోజుల క్రితమే ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్‌కు కూడా అధికారిక ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించారు, అయినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ కమిటీ ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం_ _ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళా ప్రొఫెసర్, రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె అయి ఉండి, అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోతే.. మారుమూల గ్రామాల్లో నివసించే పేద మహిళలు, దళిత మహిళలు, గిరిజన మహిళల పరిస్థితి ఏమిటి? వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోంది? మహిళల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుంది?_ _సదరు మహిళా ప్రొఫెసర్ తనకు ఎదురైన వేధింపులపై విశ్వవిద్యాలయంలోని ఉన్నతాధికారులకు గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కరించకుండా ఆమెను బదిలీ చేయడం మరింత దారుణం.తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆమె పోలీసులను ఆశ్రయించారు. కానీ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి_ _విశ్వవిద్యాలయం అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం. అలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలోనే మహిళా ఉద్యోగులకు భద్రత లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి?_ _ఈ ఘటనలో మరికొందరు కూడా బాధితులుగా ఉన్నారని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి_ _ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం_ _1 బాధిత మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి_ _2 ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి_ _3 విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీని బాధ్యతల నుంచి తప్పించి, బాధితురాలిపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలి_ _4 బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి_ _5 విచారణలో నేరం రుజువైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి_ _వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల కేటాయింపుల విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, గతంలో వంద ఎకరాల భూమి ఇతర అవసరాలకు కేటాయించగా, మరో వంద ఎకరాల భూమిని కూడా హెచ్ఎండీఏకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ వ్యవహారాలకు, ప్రస్తుత వివాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలపై కూడా సమగ్రంగా పరిశీలించాలి. విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు_ _కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చింది. మహిళలను మహాలక్ష్ములుగా,_ _మహారాణులుగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు మహిళలకు కనీసం భద్రత కల్పించలేకపోతున్నారు_ _మహిళలకు కొత్త హామీలు, ఆర్థిక ప్రయోజనాల కంటే ముందుగా వారికి ఉన్న హక్కులను కాపాడాలి,_ _ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూడాలి_ _మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకూ బయటపడుతోంది_ _రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించడం లేదు_ *_ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకు న్యాయం జరగకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనం_* _బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం బాధితురాలికి అండగా ఉంటుంది. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. మహిళలను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి_ _బాధితురాలికి న్యాయం చేయకుండా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే సహించేది లేదు_ _మహిళలకు కావాల్సింది కొత్త హామీలు కాదు.. భద్రత, గౌరవం, న్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధితురాలికి న్యాయం చేయాలి. లేదంటే మహిళల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం అన్నారు సత్యవతి రాథోడ్ గారు_

మహబూబాబాద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం

నవంబర్ 6తో ముగిసిపోదు.. డిసెంబర్ 10 వరకు, ఆ తర్వాత కూడా నమోదు చేసుకోవచ్చు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి – ఎన్నికల అధికారి స్పష్టీకరణ హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కీలక స్పష్టత ఇచ్చారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందుగా ప్రకటించిన నవంబర్ 6 చివరి తేదీతోనే అవకాశం ముగిసిపోదని, అర్హులైన పట్టభద్రులు తదుపరి దశల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ సర్వర్ సమస్యలు, గడువుపై ప్రజల్లో నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఈ ప్రకటన పట్టభద్రులకు ఊరటనిచ్చింది. మూడు దశల్లో దరఖాస్తుకు అవకాశం ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పట్టభద్రుల ఓటరు నమోదుకు ఈ క్రింది తేదీల్లో ఫారం-18 సమర్పించవచ్చు. 1. నవంబర్ 6, 2026 వరకు: తొలి విడత ఓటరు నమోదు. 2. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు: ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ సమయంలో కూడా కొత్త దరఖాస్తులు చేసుకోవచ్చు. 3. డిసెంబర్ 30, 2026 నుంచి: తుది ఓటరు జాబితా ప్రచురణ అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు కూడా ఫారం-18 సమర్పించే అవకాశం ఉంటుంది. ఎవరు అర్హులు? భారత పౌరులై ఉండి, సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా ఉండాలి. 2026 నవంబర్ 1 నాటికి కనీసం మూడేళ్ల క్రితమే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కోసం Form-18 ఎంపిక చేసుకుని అవసరమైన వివరాలు నమోదు చేసి, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఫొటో తదితర అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలి. ఆఫ్‌లైన్‌లో సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) లేదా నియమిత అధికారుల వద్ద ఫారం-18 సమర్పించవచ్చు. గతంలో ఓటు వేసినవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలి గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం ఈసారి కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి ఎన్నికకు పట్టభద్రుల ఓటరు జాబితాను కొత్తగా రూపొందిస్తున్నందున పాత ఓటరు జాబితాలో పేరు ఉందనే కారణంతో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు 1. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం. 2. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం. వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ తదితర ప్రాంతాల అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యమైన తేదీలు – నవంబర్ 6, 2026 – తొలి విడత దరఖాస్తుల చివరి తేదీ. – నవంబర్ 25, 2026 – ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ. – నవంబర్ 25 – డిసెంబర్ 10, 2026 – క్లెయిమ్స్, అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులు. – డిసెంబర్ 30, 2026 – తుది ఓటరు జాబితా ప్రచురణ. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

మహబూబాబాద్

అగ్నివీర్‌ల సర్వీస్‌ రెండేళ్లు పెంపు

నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచే యోచన_* _న్యూఢిల్లీ, నవంబరు 4: భారత రక్షణ దళాల్లో అమలవుతున్న అగ్నిపథ్‌ పథకంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..!_ _2022లో ప్రారంభమైన ఈ పథకం కింద ఎంపికైన అగ్నివీర్‌ల సర్వీస్‌ కాలాన్ని పెంచనుంది. అగ్నివీర్‌ల ప్రస్తుత 4 ఏళ్ల సర్వీస్‌ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించి మొత్తం 6 సంవత్సరాలు చేయాలని యోచిస్తోంది. సర్వీస్‌ కాలాన్ని పొడిగించడమే కాకుండా.. త్రివిధ దళాల్లో కొనసాగించాల్సిన అగ్నివీర్‌ల సంఖ్యను కూడా పెంచడానికి ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంది._ _ప్రస్తుత నిబంధలన ప్రకారం అగ్నివీర్‌లుగా ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే శాశ్వత కేడర్‌లోకి తీసుకుంటారు. అయితే త్రివిధ దళాలు ఈ పరిమితిని భారీగా పెంచాలని ప్రతిపాదించాయి. వీటికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని ఈ నెల 21 లోపు ప్రకటించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఆర్మీ, వైమానిక దళాలు ఈ పరిమితిని 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరుతుండగా, నేవీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండడంతో 70ు-75ు మంది అగ్నివీర్‌లను శాశ్వతంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది._ _నౌకాదళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీ కాలం నవంబరు 21న, వైమానిక దళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 21తో, సైన్యం మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 31తో ముగియనుంది. కాబట్టి ఈ లోపే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నాలుగేళ్ల కిత్రం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో మొదటి విడతలో 24,400మంది అగ్నివీర్‌లు చేరారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగేళ్లలో సైన్యంలో సుమారు 2,70,000మంది, వాయుసేనలో 27,000 మంది, నేవీలో 21,000 మంది అగ్నివీర్‌లుగా నియమితులయ్యారు._

మహబూబాబాద్

తుఫాను దెబ్బకు అన్నదాత అతలాకుతలం!

నేలకొరిగిన వరి.. దెబ్బతిన్న మిర్చి.. నీట మునిగిన పంటలు నష్టాల భారంతో కుంగిపోతున్న రైతులు.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి మరిపెడ: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ఆశలతో అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాయి. చేతికొచ్చే సమయంలో వరి పంట నేలకొరిగి, పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిర్చి పంటకు వేరు కుళ్లు తెగులు సోకడం, అధిక తేమ కారణంగా మొక్కలు దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. వరి, మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలపై కూడా వర్షాల ప్రభావం పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అన్నీ భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని అంచనా వేయాలి. దెబ్బతిన్న వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను పరిశీలించి పారదర్శకంగా నష్టం నమోదు చేయాలి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించడంతో పాటు పంటల బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ రుణాల విషయంలోనూ రైతులకు వెసులుబాటు కల్పించాలి. అవసరమైన చోట వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించాలి. రైతు కన్నీరు తుడవాల్సిన సమయం ఇదే! ఒకవైపు పెట్టుబడుల భారం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు.. ఇంకోవైపు అప్పుల ఒత్తిడితో అన్నదాతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నే నష్టాల పాలైతే అతడిని ఆదుకునేది ఎవరు? రైతు కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందించి పరిహారం అందించే వరకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

మహబూబాబాద్

ధరలు భారీగా తగ్గినా.. మార్కెట్లో దొరకని వెండి!

ధరలు భారీగా తగ్గినా.. మార్కెట్లో దొరకని వెండి! ఆరు నెలల్లో 6,500 టన్నుల దిగుమతికి కేంద్రం అనుమతులు.. అసలు కారణాలివే! న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగి సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకున్నాయి. అయితే 2026లో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో వెండి లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రానున్న ఆరు నెలల్లో సుమారు 6,500 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకునేందుకు అనుమతులు జారీ చేసింది. 2025లో భారీగా పెరిగిన వెండి ధరలు 2025 సంవత్సరం వెండి మార్కెట్‌కు కీలకంగా నిలిచింది. అంతర్జాతీయంగా పారిశ్రామిక అవసరాలు పెరగడం, సౌర విద్యుత్ ప్యానెల్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి వినియోగం అధికం కావడం, పెట్టుబడిదారులు వెండి ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టడంతో డిమాండ్ పెరిగింది. దీనికి తోడు సరఫరా పరిమితులు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. 2025లో భారత్‌లో వెండి దిగుమతుల విలువ పెరిగినా, దేశీయంగా సరఫరా ఒత్తిడి కొనసాగింది. 2026లో ధరలు ఎందుకు తగ్గాయి? 2026లో అంతర్జాతీయ మార్కెట్లో ధరల సర్దుబాటు, గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోళ్లలో మందగమనం వంటి కారణాలతో వెండి ధరలు తగ్గాయి. గతంలో కిలో వెండి సుమారు రూ.4 లక్షల గరిష్ఠ స్థాయిని తాకగా, 2026 అక్టోబర్ చివరి నాటికి సుమారు రూ.1.95 లక్షల స్థాయికి పడిపోయినట్లు మార్కెట్ నివేదికలు వెల్లడించాయి. అయితే అంతర్జాతీయ ధరలు తగ్గినంత మాత్రాన దేశీయ మార్కెట్లో సరఫరా సమస్యలు వెంటనే పరిష్కారం కాలేదు. భారత్‌లో వెండి కొరతకు కారణమేంటి? భారత్ తన వెండి అవసరాల్లో 80 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2026 మే నెలలో కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. జూన్‌లో వెండి గింజలు, పొడి రూపాల్లో దిగుమతులకు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో దిగుమతిదారులు అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. విదేశాల నుంచి వెండి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అనుమతుల జాప్యం, అధిక సుంకాలు, రవాణా సమస్యల కారణంగా దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గింది. దిగుమతులకు అనుమతి ఎందుకు ఇచ్చింది? 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ వెండి దిగుమతుల కోసం సుమారు 12 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఒకవైపు విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతులను నియంత్రించగా, మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి కొరత తీవ్రం కావడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజాగా ఆరు నెలల కాలానికి 6,500 టన్నుల వెండి దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల మార్కెట్లో సరఫరా పెరిగి, స్థానికంగా ఉన్న అదనపు ధరల భారం తగ్గే అవకాశం ఉంది. ధరలు మరింత తగ్గుతాయా? ప్రభుత్వం ఇచ్చిన దిగుమతి అనుమతులతో వెండి లభ్యత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, పారిశ్రామిక డిమాండ్ వంటి అంశాలపై భవిష్యత్ ధరలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 6,500 టన్నుల దిగుమతికి అనుమతులు ఇచ్చినంత మాత్రాన మొత్తం వెండి వెంటనే దేశానికి చేరుతుందని కాదు. వాస్తవంగా ఎంత దిగుమతి అవుతుంది, ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనేదానిపై ధరల ప్రభావం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే వెండి ధరల తగ్గుదల ఒకవైపు, సరఫరా కొరత మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో వెండి మార్కెట్ ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

మహబూబాబాద్

పుష్ప సినిమా తరహాలో పశువుల అక్రమ రవాణా.. బయటకు కొబ్బరి బొండాలు.. లోపల మూగజీవాలు!

*పుష్ప సినిమా తరహాలో పశువుల అక్రమ రవాణా.. బయటకు కొబ్బరి బొండాలు.. లోపల మూగజీవాలు!* *మరిపెడ పోలీసుల అప్రమత్తతతో గుట్టురట్టు.. నంబర్ ప్లేట్ లేని ట్రాలీలో 8 పశువుల తరలింపు.. ముగ్గురు నిందితులపై కేసు నమోదు* హైదరాబాద్, నవంబర్ 3 | సినిమాల్లో కనిపించే ఎత్తుగడలను తలపించేలా కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వెలుగులోకి వచ్చింది. బయటకు కొబ్బరి బొండాలతో వెళ్తున్నట్లు కనిపించే టాటా ట్రాలీలో లోపల మూగజీవాలను కుక్కి తరలిస్తున్న అక్రమ దందాను మరిపెడ పోలీసులు తమ రాత్రి గస్తీలో గుర్తించి అడ్డుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో ఎనిమిది పశువులకు విముక్తి లభించింది. *రాత్రి గస్తీలో అనుమానాస్పద వాహనం గుర్తింపు* రాత్రి సమయంలో మరిపెడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు సిబ్బంది పీసీ నరేష్, పీసీ జి. శ్రీను పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేకుండా కొబ్బరి బొండాలతో వెళ్తున్న టాటా ట్రాలీ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వాహనంలో కొబ్బరి బొండాల మాటున కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టివేసిన ఆరు ఆవులు, రెండు కోడెగిత్తలు కలిపి మొత్తం ఎనిమిది పశువులను గుర్తించారు. కదలలేని స్థితిలో పశువులను తరలిస్తున్న తీరును గమనించిన పోలీసులు వెంటనే వాటిని రక్షించే చర్యలు చేపట్టారు. *అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు అక్రమ తరలింపు* ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ప్రాంతానికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అనే ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. అనకాపల్లి ప్రాంతం నుంచి పశువులను సేకరించి, కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్‌లోని కబేళాలకు గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. *మూగజీవాలకు వైద్య చికిత్స.. వాహనం సీజ్* పోలీసులు రక్షించిన పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి పశువైద్యుల ద్వారా అవసరమైన చికిత్స అందించారు. గాయపడిన పశువులు ప్రస్తుతం కోలుకున్నాయి. అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీని పోలీసులు సీజ్ చేసి, నిందితులపై పశువుల అక్రమ రవాణా, జంతువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. *మరిపెడ పోలీసుల నిబద్ధత అభినందనీయం* నేరాల నియంత్రణలో నిరంతర నిఘా, సమర్థవంతమైన గస్తీ ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. విధి నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించి, అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించడం ద్వారా మరిపెడ పోలీసు సిబ్బంది తమ వృత్తి నిబద్ధతను చాటుకున్నారు. ప్రజల భద్రతతో పాటు మూగజీవాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన చర్యలు ప్రశంసనీయం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మరిపెడ ఎస్‌ఐ సతీష్ వెల్లడించారు. *నేరాల నియంత్రణకు ముందస్తు నిఘా.. మహబూబాబాద్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు* *రాత్రి పూట నేరాలు తగ్గుముఖం* ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకునే నేరాల తీరును విశ్లేషిస్తూ, మహబూబాబాద్ జిల్లాలోనూ అలాంటి ఘటనలు జరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేయడం నేరాల నియంత్రణలో కీలకంగా మారుతోంది. అలాగే ప్రత్యేక రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద దొంగతనాలు జరగకుండా గస్తీని ముమ్మరం చేయడం ద్వారా ప్రజల ఆస్తుల రక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు పశువుల అక్రమ రవాణా, మూగజీవాల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పున్నమి రిపోర్టర్ , భూక్య రాము నాయక్ మరిపెడ, మహబూబాబాద్ జిల్లా Uploaded Video:

మహబూబాబాద్

కురవి మండలంలో ఆర్టీఏ కొరడా.. బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!

*కురవి మండలంలో ఆర్టీఏ కొరడా.. బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!* *ఓవర్‌లోడ్ ఆటోలు సీజ్.. సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు* మహబూబాబాద్, నవంబర్ 3 | 2026; మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బడి పిల్లలను తరలించే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు వరుసగా రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. కురవి మండల కేంద్రంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. *ఓవర్‌లోడ్ వాహనాలు సీజ్* విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకొని వెళ్తున్న ఆటోలతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్‌సీ, ఎఫ్‌సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వాహన యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. *తల్లిదండ్రులకు విజ్ఞప్తి* తల్లిదండ్రులు తమ పిల్లలను ఓవర్‌లోడ్ ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాల్లో పాఠశాలలకు పంపించవద్దు. వాహనంలో పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్నారా? డ్రైవర్‌కు సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? వాహనానికి అవసరమైన పత్రాలు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించాలి. పిల్లలను సురక్షితంగా పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత. *పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి* పాఠశాలలకు విద్యార్థులను తీసుకువచ్చే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, ఇతర రవాణా వాహనాలకు అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయో లేదో యాజమాన్యాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి. డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే విద్యార్థులను తరలించే బాధ్యత అప్పగించాలి. విద్యార్థుల భద్రతను విస్మరించవద్దని సూచిస్తున్నారు. *వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరం* వర్షాల సమయంలో కరకట్టలు, చెరువు కట్టలు, బురద రహదారులు, జారుడు మార్గాల్లో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం కారణంగా టైర్లు జారిపోయే ప్రమాదం ఉంది. వాహనం అదుపు తప్పడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. ముఖ్యంగా బడి పిల్లలను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు వేగాన్ని తగ్గించి, రహదారి పరిస్థితులను గమనిస్తూ ప్రయాణించాలి. ఈ ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎస్. వెంకట్ రెడ్డి, ఖాసీం, సుందర్‌లాల్ పాల్గొని వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రవాణా నిబంధనలు పాటించాలని, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, వాహన యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. *మహబూబాబాద్ జిల్లా* *రవాణా శాఖ కార్యాలయం*

మహబూబాబాద్

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. నెల రోజుల్లో పసిడి ధరకు తగ్గుదల!

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. నెల రోజుల్లో పసిడి ధరకు తగ్గుదల! హైదరాబాద్, నవంబర్ 3: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గత నెల రోజులుగా ధరల మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ ప్రారంభంతో పోలిస్తే నెలాఖరుకు బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.10,750 తగ్గగా, వెండి కిలోకు సుమారు రూ.35,200 మేర తగ్గింది. అక్టోబర్ 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,49,630 ఉండగా, అక్టోబర్ 31 నాటికి రూ.1,38,880కు చేరింది. అలాగే వెండి కిలో ధర రూ.2,61,100 నుంచి రూ.2,25,900కు తగ్గింది. నవంబర్ ప్రారంభంలో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. నవంబర్ 3న హైదరాబాద్ మార్కెట్ సూచిక ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1,39,380, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,760గా ఉండగా, వెండి కిలో ధర సుమారు రూ.1,99,900గా నమోదైంది. ధరల మార్పులకు కారణాలివే! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల మార్పులు, అమెరికా డాలర్ బలపడటం లేదా బలహీనపడటం, వడ్డీ రేట్ల అంచనాలు, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వెండికి పారిశ్రామిక రంగంలో ఉన్న డిమాండ్ కూడా ధరల మార్పులకు కారణమవుతోంది. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా? మరింత తగ్గుతాయా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే ప్రజలు రోజువారీ మార్కెట్ ధరలను పరిశీలించాలని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి. ఆభరణాల కొనుగోలులో మజూరీ, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

మహబూబాబాద్

అనారోగ్యంతో మృతి చెందిన వార్డు సభ్యుడి అల్లుడికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు

అనారోగ్యంతో మృతి చెందిన వార్డు సభ్యుడి అల్లుడికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు తొర్రూరు: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డు సభ్యుడు కస్తూరి ఈశ్వర్ అల్లుడు అనారోగ్యంతో నెల్లికుదురు మండలం కాశికల్ గ్రామంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ యువ నాయకులు కాశికల్ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆప్తుడిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. – పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్ మరిపెడ, మహబూబాబాద్ జిల్లా.