సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి/రామగుండం, సెప్టెంబర్ 15: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, అధికారులు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.సమావేశంలో డీసీపీలు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ముందుగా పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను సీపీ తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారీగా ఆన్‌లైన్‌లో నమోదైన పెండింగ్ అంశాలను కూడా సమీక్షించారు.పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు.పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు సైతం పోలీసులకు తెలిసేలా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారానికోసారి సమీక్షించాలని సూచించారు.ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా గస్తీ నిర్వహించడంతో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ప్రజలతో పోలీసుల సంబంధాలను మరింత పెంచాలని సూచించారు.మహిళలు, బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపైనా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని సీపీ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి, నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBW) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని సూచించారు.గంజాయి అక్రమ సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.సైబర్ నేర విభాగం పనితీరును సీపీ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు. డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా త్వరితగతిన విచారించాలని ఆదేశించారు. ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని, తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని సూచించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు.వినాయక మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి మండప నిర్వాహకుడి పూర్తి వివరాలను సేకరించాలని, ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మండప నిర్వాహకులే బాధ్యత వహించాలని తెలిపారు. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్ల కోసం సంబంధిత శాఖలతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టినా, వాటిని ఇతరులకు పంపించినా చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు.కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక సోషల్ మీడియా విభాగం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వెలువడే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డితో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


