రైల్వే ఉద్యోగుల 22 డిమాండ్ల సాధనకు నిరసనలకు పిలుపు
నందలూరు : రైల్వే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ SCoRMU గుంతకల్ డివిజన్ నాయకులు సెప్టెంబర్ 29న వివిధ పని ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు డివిజనల్ కార్యవర్గ సభ్యులు, బ్రాంచ్ కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులకు అత్యవసర సందేశాన్ని జారీ చేశారు. రైల్వే ఉద్యోగుల పని పరిస్థితులను మెరుగుపరచడం, పెండింగ్ బకాయిలను చెల్లించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం తదితర అంశాలపై యూనియన్ నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు. లోకో పైలట్లు, ట్రాఫిక్ రన్నింగ్ సిబ్బంది పని గంటలను 10 గంటలకు పరిమితం చేయాలని, FOG పరికరం, టెయిల్ ల్యాంప్ బాధ్యతలను సిబ్బందిపై నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లోకో, రన్నింగ్, C&W, S&T, ఏసీ, ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల సిబ్బందికి పెండింగ్ OTA బకాయిలు, TTEలు, ఇతర సిబ్బందికి TA బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విడుదల చేయాలని, ట్రాక్‌మెయింటైనర్ల పెట్రోలింగ్ బీట్‌ను 12 కిలోమీటర్లకు పరిమితం చేయాలని పేర్కొన్నారు. రాత్రి పెట్రోలింగ్‌కు ఇద్దరు పెట్రోల్‌మెన్‌లను నియమించాలని, కీమ్యాన్‌లపై అదనపు పనుల భారం తగ్గించాలని, మహిళా ఉద్యోగులు కోరిన కేడర్ మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కొత్త ఆస్తులకు అనుగుణంగా అదనపు పోస్టులను సృష్టించాలని కోరారు. ఇవే కాకుండా GDCE, LDCE పరీక్షలను నిర్వహించడం, ప్రమోషన్ల కోసం ప్రతి నెల CBT పరీక్షలు చేపట్టడం, ట్రాక్‌మెయింటైనర్లకు ఇతర విభాగాల్లో AVC అవకాశాలు కల్పించడం, రైల్వే ఆసుపత్రుల్లో తగినంత సిబ్బందిని నియమించడం వంటి అంశాలను కూడా తమ డిమాండ్లలో చేర్చారు. బోనస్ లెక్కింపునకు సంబంధించిన పరిమితిని ప్రస్తుత రూ.7,000 నుంచి రూ.21,000కు పెంచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 29న భోజన విరామ సమయంలో లేదా అనుకూలమైన సమయంలో తమ తమ పని ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని SCoRMU గుంతకల్ డివిజన్ డివిజనల్ కార్యదర్శి కె. అశ్వని పిలుపునిచ్చారు.

