Friday, 11 September 2026

Tag: #Manthani #Peddapalli #bjp

పెద్దపల్లి

బురద జల్లే దిగజారుడు రాజకీయాలు సహించేది లేదు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి మంథని అభివృద్ధిని కాంక్షించే రాజకీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అభివృద్ధి పనులకు పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మంథనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామపంచాయతీలతో పాటు మంథని పురపాలక సంఘానికి అందుతున్న కోట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని తెలిపారు. మంథని అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంథని మున్సిపల్‌ మార్కెట్‌ భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి తమ కుటుంబమే కారణమంటూ కొందరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని సునీల్‌ రెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలకు పాల్పడటం సరికాదని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. దివంగత నేత, తన తండ్రి చంద్రుపట్ల రామ్‌ రెడ్డి హయాంలోనే మంథని మార్కెట్‌కు పునాదులు పడ్డాయని సునీల్‌ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుంచి మార్కెట్‌ అభివృద్ధికి సంబంధించి తమవంతుగా సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాల్సిన అవసరం ఉందని, అనాలోచితంగా తొందరపడి నిర్మాణం చేపట్టకూడదని మున్సిపల్‌ అధికారులకు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున పలుమార్లు సూచించినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వమే ప్రధానమని సునీల్‌ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు ఎదుటి వారిపై అసత్య ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బురదజల్లే రాజకీయాలు, తిట్ల దండకాలు మానుకోవాలని సూచించారు. మంథని అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో కేవలం అసూయ, ద్వేషంతో రాజకీయాలు చేయాలని చూసే వారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని సూచించారు. తమ కుటుంబానికి ప్రజాసేవలో ఘనమైన చరిత్ర ఉందని సునీల్‌ రెడ్డి పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలను అసత్య ప్రచారాలతో దెబ్బతీయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, మాజీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి వొజ్జల మురళీకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఎడ్ల సాగర్, ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఆంటి మల్లేష్, కార్యదర్శి పార్వతి విష్ణు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గుడ్ల గురవేష్, మండల ఉపాధ్యక్షుడు ఎల్లవేణి సమ్మయ్య, నాయకులు చందు, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.