విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇటీవల సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు సీహెచ్. పోచయ్య, బహుత్ కిషోర్ లను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఉపాధ్యాయులు అందించిన సేవలకు లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాలను భావించాలని అన్నారు. అవార్డులతో ఉపాధ్యాయులపై బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.
విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఉపాధ్యాయుల నిజమైన విజయమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు లభించిన అవార్డుతో పాటు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానం మరింత బాధ్యతను పెంచిందన్నారు. తమ సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం విద్యార్థుల కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేల్పుల గట్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మంథని లక్ష్మణ్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మంథని మండల అధ్యక్షులు కర్ణ కృష్ణ, దళిత నాయకులు కాసిపేట వెంకటస్వామి, కనుకుట్ల స్వామి, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.


