బీసీల హక్కులు, హామీలు అమలు చేయాలి
బీసీల హక్కులు, హామీలు అమలు చేయాలి కడప, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): బీసీలకు న్యాయపరంగా, చట్టపరంగా దక్కాల్సిన హక్కులు, హామీలను వెంటనే అమలు చేయాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ కడప జిల్లా అధ్యక్షులు తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యం. శివ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కడప కలెక్టరేట్‌లో డీఆర్వోకు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బీసీలు నేటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలుగానే కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇస్తున్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని విమర్శించారు. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ప్రధాన డిమాండ్లు: – 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అమలు చేయాలి. – బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. – బీపీ మండల్, చాకలి ఐలమ్మ జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. – భూమిలేని వ్యవసాయ కూలీలుగా ఉన్న బీసీ కులాలకు రెండు ఎకరాల భూమి ఇవ్వాలి. – స్థానిక సంస్థల్లో బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి. – పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ రుణాలను వెంటనే మంజూరు చేయాలి. – పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. – బీసీ బాలబాలికలకు పక్కా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. – చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. – బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. – మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ జేఏసీ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్దిపల్లి మల్లికార్జున, జనతాదళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎం. ప్రతాపరెడ్డి, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులు కేశవులు, జిల్లా నాయకులు ఎన్. గంగులయ్య, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ కమలాపురం అధ్యక్షులు ఎస్వీ రమణ, బీసీ నాయకులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమాభివందనాలతో.. తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు యం. శివ శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ – కడప జిల్లా కమిటీ

