శిథిలావస్థలో అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందా?
కిష్టాపూర్‌లో కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం పైకప్పు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు.. భయాందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ రెబ్బెన, ఆగస్టు 13: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంగన్వాడీ భవనం పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రస్తుతం గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే కమ్యూనిటీ హాల్ పైకప్పు నుంచి స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయని, దీంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు చదువుకునే ప్రదేశంలోనే పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి బదులుగా కిష్టాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మించి, చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్ కిష్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కమ్యూనిటీ హాల్ పైకప్పు పరిస్థితిని పరిశీలించి, ప్రమాదం సంభవించేలోపు మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారంగా నూతన అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.



