తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారడంతో పాటు నైరుతీ రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. కాగా, సోమవారం సాయంత్రం నాటికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అత్యధికంగా 66.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అనంతపురం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో జంగమహేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది.
VINOD KUMAR



