భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సెప్టెంబర్ 4:(పున్నమి న్యూస్ )…
ఎరువుల బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ (FFS) యాప్ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే విధానం తమకు అనుకూలంగా లేదని వాపోయారు.
హేమచంద్రాపురం రైతులు బైకాని రామ్మూర్తి, తరాల శ్రీను, కుందూరు గోపాల్‌రెడ్డి, గోలి శ్రీను, రాజబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ భూములు 1/70 చట్టం పరిధిలో ఉండటంతో భూములు కొనుగోలు చేసినప్పటికీ రికార్డుల్లో, పహాణిలో పేర్లు మారడం లేదని తెలిపారు. దీంతో ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో ఎరువులు బుక్ చేసుకునే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
‘‘మా దగ్గర స్మార్ట్ఫోన్లు లేవు.. చిన్న ఫోన్లతో ఆన్లైన్లో ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలి?’’ అని ప్రశ్నించారు. దుకాణాల్లో బుకింగ్ చేయించుకునే ప్రయత్నం చేసినా కొద్ది సమయంలోనే స్టాక్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ, ఎప్పుడు అందిస్తారో కూడా స్పష్టత ఉండటం లేదన్నారు.
మరోవైపు ఎరువులు, వ్యవసాయ మందుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరింత భారంగా మారాయని రైతులు తెలిపారు. మందుల కట్ట ధరలు రూ.600 నుంచి రూ.700, రూ.800 వరకు పెరిగాయని చెప్పారు. విత్తనాలు సైతం సకాలంలో అందుబాటులో ఉండటం లేదని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ప్రభుత్వాలు కొత్త కొత్త యాప్‌లు తీసుకొస్తూ రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్నాయి కానీ మేము మాత్రం సంతోషంగా లేం’’ అని రైతులు పేర్కొన్నారు. అప్పులు చేసి సాగు చేస్తున్న తమపై అదనపు భారం పడుతోందని తెలిపారు.
స్మార్ట్ఫోన్లు లేని రైతులు, పహాణిలో పేర్లు నమోదు కాని భూ యజమానులకు ప్రత్యామ్నాయ విధానం కల్పించాలని, గతంలో మాదిరిగా దుకాణాల ద్వారా ఎరువులు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హేమచంద్రాపురం రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.


