** ఘనంగా 51వ శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం వార్షికోత్సవం**
* 263 మంది విద్యార్థులకు రూ. 80 లక్షల ఉపకార వేతనాల పంపిణీ
* గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక సాయం హర్షించదగ్గ విషయం: రిటైర్డ్ కలెక్టర్ ఆర్. కృష్ణయ్య
* ఆర్థికలేమి ప్రతిభకు అడ్డంకి కాకూడదన్నదే మా లక్ష్యం: అమరరాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు
పూతలపట్టు, అక్టోబర్ 2 ( పున్నమి ప్రతినిధి ):
పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ విద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అమరరాజా సంస్థల అధినేత, సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 263 మంది విద్యార్థులకు రూ. 80 లక్షల విలువైన ఉపకార వేతనాలను (స్కాలర్షిప్స్) పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ కలెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉన్నత విద్య కోసం శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం వారు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో గల్లా రామచంద్ర నాయుడు పరిశ్రమలు, విద్యాసంస్థలు నెలకొల్పి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని, కేవలం చదువే కాకుండా క్రమశిక్షణ, మానవతా విలువలు అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ స్వర్గీయ పాటూరు రాజగోపాల్ నాయుడు స్ఫూర్తితో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని స్థిరపడిన తర్వాత, భవిష్యత్తులో మరింత మంది పేద విద్యార్థులకు తమవంతు సహాయం చేయాలని సూచించారు. సంస్థకు దన్నుగా నిలుస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమర హాస్పిటల్ అధినేత, సంఘం అధ్యక్షురాలు డాక్టర్ గౌరినేని రమాదేవి మాట్లాడుతూ.. ఏ ప్రతిభావంతుడైన విద్యార్థీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన లక్ష్యాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ విద్యా సహాయ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. విద్యార్థులు తమకు లభించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యదర్శి మహదేవ నాయుడు మాట్లాడుతూ.. సంస్థను ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు పూర్తయిందని, ప్రతి ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాది 263 మందికి రూ. 80 లక్షల చెక్కులను పంపిణీ చేశామని వివరించారు. లబ్ధి పొందిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగాక సంస్థకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సతీష్ రాళ్లపల్లి, బాలాజీ కిరణ్, ప్రణీత్ సుధీర్, డాక్టర్ ప్రసాద్, ఉమాకాంత్, పేటమిట్ట మాజీ సర్పంచ్ గల్లా రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


