*కేతనకొండలో గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.*
ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం మండలం. సెప్టెంబర్.28. పున్నమి న్యూస్
కేతనకొండ:
గ్రామంలో సోమవారం ఉదయం.నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో అనారోగ్యం, కంటి సమస్యలు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వందలాది మంది రోగులకు వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా విలువైన మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ.. “ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పేద ప్రజలకు మనకు చేతనైన సహాయం అందించాలనే ఆలోచనతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశాం” అని తెలిపారు. శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందించడమే కాకుండా, వారికి గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతినిధులు మంచి భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మానవ సేవయే మాధవ సేవ:
ఈ శిబిరంలో అమెరికా దేశం నుండి వచ్చిన లిండ్సే, అలెగ్జాండ్రా ప్రత్యేకంగా పాల్గొని రోగులకు ఎంతో ప్రేమతో పరిచర్యలు అందించారు. మానవ సేవయే మాధవ సేవ అని వారు నిరూపించారు. దేవుని సృష్టి అంతటిలో మానవ జన్మ ఎంతో ప్రత్యేకమైనదని, ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే దైవోక్తి ప్రకారం ఇతరులకు సహాయం చేయడం సంతోషంగా ఉందని వారు కొనియాడారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ సేవా కార్యక్రమంలో గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ సుమలత, ప్రముఖ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ హరీషా, డాక్టర్ ప్రభు కుమార్, డాక్టర్ రమ్యలతో పాటు చంటి, ప్రశాంతి, సంస్థ పెద్దలు యోహాను, పాల్, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




