✒️ *మురుగునీటి కాలువగా మారి.. పరిసర ప్రజలకు ఇబ్బందులు*
✒️ *డంపింగ్ యార్డులతో పూడుకుపోతున్న కొండ కాలువ*
✒️ *ఆక్రమణలకు గురవుతోందా? అధికారులు పరిశీలించాలంటున్న స్థానికులు*
✒️ *సర్వే నంబర్ 325ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువ పరిస్థితిపై చర్యలు ఎప్పుడు?*
✍️ తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో ఒకప్పుడు వ్యవసాయానికి ఆధారంగా నిలిచిన *కొండ కాలువ* నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. కొండ ప్రాంతంలో పుట్టే నీరు ఉలవసేన, కోటమిట్ట మీదుగా ప్రవహిస్తూ సత్యవేడు *ఆర్టీసీ బస్టాండ్* వెనుక భాగం నుంచి సాగుభూములకు చేరి, ధర్మరాజుల గుడి సమీపంలో ఉన్న చెరువులో కలిసేదని స్థానికులు చెబుతున్నారు.
👉 పూర్వం ఈ కాలువ సుమారు *25 నుంచి 30* అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలువను నమ్ముకుని అనేక మంది *రైతులు వ్యవసాయం* చేసేవారని స్థానికుల కథనం. అయితే కాలక్రమేణా కాలువ ఆక్రమణలు, మట్టి పేరుకుపోవడం, *వ్యర్థాల డంపింగ్* కారణంగా క్రమంగా కుంచించుకుపోయిందని వారు చెబుతున్నారు.
👉 ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో కాలువ ఆనవాళ్లు కేవలం *మూడు నుంచి నాలుగు అడుగుల* మేరకే కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కొండ నుంచి వచ్చే వర్షపు నీటిని సాగుభూములకు అందించిన ఈ కాలువ.. నేడు మురుగునీరు ప్రవహించే డ్రైనేజీగా మారిందని చెబుతున్నారు.
👉 కాలువ పక్కనే *పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను డంపింగ్* చేయడంతో మరింతగా పూడుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో కాలువ సహజ ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో పాటు దోమలు, దుర్వాసన వంటి సమస్యలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు.
👉 *సర్వే నంబర్ 325ను* ఆనుకుని ఉన్న ఈ కాలువపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. *కాలువ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి?* *ఎక్కడైనా ఆక్రమణలు జరిగాయా?* *వ్యర్థాలను డంపింగ్ చేసేందుకు అనుమతులు ఎలా వచ్చాయి?* అనే అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
👉 ముఖ్యంగా పట్టణానికి సమీపంలోనే ఇలాంటి డంపింగ్ యార్డులకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనావాసాలకు దూరంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరుతున్నారు.
👉 25 నుంచి 30 అడుగుల వెడల్పు ఉన్నట్లు చెబుతున్న కొండ కాలువ.. నేడు మూడు, నాలుగు అడుగులకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలిన కాలువ కూడా పూర్తిగా కనుమరుగయ్యేలోపు అధికారులు చర్యలు తీసుకుంటారా?
✍️ కాలువను పునరుద్ధరించి, ఆక్రమణలు మరియు వ్యర్థాల డంపింగ్‌ను తొలగించి, పూర్వపు నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సత్యవేడు ప్రజలు కోరుతున్నారు.


